Wednesday, December 11, 2013

౩.కఠోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

స్వర్గ ఫలాలను కోరి వాజశ్రవనుడు ఒకయుగంలో తన అస్తినంతటిని దానం చేశాడు. అతనికి నచికేతుడనే పేరు గల ఒక పుత్రుడున్నాడు.
నచికేతుడు, తండ్రీ నన్ను ఎవరికి ఇవ్వబోతున్నావు? అని అతడు తండ్రిని రెండు మూడు సార్లు అడిగాడు. ఆ ప్రశ్నకి కోపం వచ్చిన తండ్రి నిన్ను మృత్యు దేవతైన యముడికి యిస్తాను అని బదులు పల్కాడు.
అప్పుడు నచికేతుడు తనలోతాను ఇలా అనుకున్నాడు, నన్ను యముడికి ఇవ్వటంలో అయన ఉద్దేశ్యం ఏమిటి ? అప్పుడు నచికేతుడు ఇలా ఆలోచించాడు, ప్రాచీనులు ఎలా వర్తించారో జ్ఞాపకం తెచ్చుకో. అలాగే ఇపుడు ఇతరులు కూడా ఎలా నడుచుకుంటున్నారో గమనించు. మర్త్యులు ధాన్యంలాగానే పండి రాలిపోతారు. ధాన్యంలాగానే మళ్ళీ పుట్టుకొస్తారు.
సత్యమహిమను గుర్తించినవాడై నచికేతుని తండ్రి చివరికి తన కుమారుని యముని వద్దకు పంపుతాడు. అప్పుడు యముడు ఇంట్లో ఉండదు. అందుకు నచికేతుడు నిద్రాహారాలు లేకుండా మూడు రోజులు వేచి ఉండవలసి వస్తుంది. యముడు తిరిగి వచ్చాక నచికేతునితో యముడు ఇలా అన్నాడు, నీవు నిరాహారిగా మూడు రాత్రులు గడిపావు కావున వాటికీ పరిహారంగా మూడు వారలు కోరుకో.
అప్పుడు నచికేతుడు మూడు వరాలు కోరుకుంటాడు. అందులో రెండు వరాలను యముడు మామూలుగానే ప్రసాదిస్తాడు కానీ నచికేతుడు మూడో వరం ఇలా అడుగుతాడు.
మానవుడు మరణించాక వచ్చే సందేహమిది. చనిపాయిన వ్యక్తీ ఉన్నాడని కొందరంటారు. మరీ కొందరు లేదంటారు. దీని గురించి తెలుసుకోవాలని నా కోరిక. అప్పుడు యముడు, నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అందువలన వేరే ఏదైనా కోరుకో, ఈ వరం మాత్రం నన్ను అర్ధించకు. ఈ మాటనుండి నన్ను వదిలిపెట్టు.
అప్పుడు నచికేతుడు ఈ విషయం అంత సులభంగా అర్ధమయ్యేది కాదని నువ్వే చెపుతున్నావు. నాకు నీతో సమానుడైన ఆచార్యుడు కూడ ఎక్కడ లభ్యం కాడు. అందుచేత ఈ వరంతో సమానమైన వరం మరేది లేదనే నేను అనుకుంటున్నాను.
అప్పుడు యముడు, ఓ నచికేత నీవు అనుభవించడానికి కావలసినన్ని సంపదలు మరియు ఎంతో అందమైన స్త్రీలు, మరియు నీవు నీకు ఇష్టమైనంత వరకు జీవించెంత కాలమును నీకు ప్రసాదిస్తాను వాటిని కోరుకో అంటాడు. దీనితో సమానమైన వరమేదైనా నీకు తోస్తే అదే కోరుకో . ఓ నచికేత సువిశాల సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తిగా వుండు. నీకు కలిగే కోరికలన్నీ నేరేవేరెలా నేను వరమిస్తాను. కానీ మరణాన్ని గురించి మాత్రం నన్ను అడుగవద్దు.
అప్పుడు నచికేతుడు, ఓ యమరాజ నువ్వు చెప్పే ఇవన్ని కూడా క్షణికాలే మానవుడి ఇంద్రియాల శక్తిని నశింపజేసేవే. ఎంత పొడిగించినా మానవుడి జీవితం అల్పమే. అందువలన నీవు ఇవ్వదలచుకున్నవి అన్నియు నువ్వే ఉంచుకో. 
మానవుడు ఏనాటికి ధనంతో తృప్తి పడలేడు. నువ్వు విధించినంత కాలము ఎలాగు జీవిస్తాము . కానీ మరణానంతరము వుండే అమోఘమైన జీవితం గురించిన జ్ఞానం నేను కోరే వరం .
అప్పుడు యముడు, ఓ నచికేత అజ్ఞానము జ్ఞానము అనబడే ఈ రెండు విభిన్న గమ్యాలకు తీసుకుపోయేవి. అపారమైన అంతరం కలవి. నచికేతుడు జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్ని విషయభోగాల ప్రలోభాలైన నిన్ను చలింపచేయలేక పోయాయి.
లోకములో ఒకటి శ్రేయస్సు నొసంగునది, మరియొకటి దానికంటె విలక్షణమైనది ప్రేయస్సు నొసంగునది అని రెండు కలవు. భిన్నర్ధములు కల ఈ రెండును మనుజుని చెంతకు వచ్చి చేరుచున్నవి. ఇందు శ్రేయస్సును అనుసరించువానికి శుభము కలుగును. ప్రేయస్సును వాంచించువాడు గమ్యస్థానమును పొందజాలడు.
శ్రేయస్సు, ప్రేయస్సు అను రెండును మనుజుని సమీపించును. వివేకవంతు లీ రెంటిని చక్కగా పరీక్షించి ఒకదానినుండి మరియొక దానిని వేరు చేయుదురు. అందు శ్రేయస్సును మాత్రమె ధీరుడు కోరుకొనును. మండబుద్దిగాలవాడు రాగాత్రుష్ణలకు లోనై ప్రేయస్సునే కోరుకొని బంధమునందు చిక్కుకోనును.
గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయి వున్న మూర్ఖులు తామే ప్రజ్ఞావంతులు గొప్ప విద్వాంసులు అనుకుంటూ గ్రుడ్డివాళ్ళ చేత నడిపించబడే గ్రుడ్డివాళ్ళలాగా తూలుతూ తడబడుతూ సుడులు తిరుగుతూ వుంటారు.
జాగ్రత్తలేని బాలుడికి వలె ధనమదంతో మతిపోయిన వారికీ శ్రేయోమర్గము ఎన్నటికి కనిపించదు. వున్నది ఈ లోకమే మరో లోకం లేదు అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ నా చేతిలో పడుతూ ఉంటాడు.
దానిగురించి వినడం కూడా ఎంతోమందికి సాధ్యపడదు. దాని గూర్చి వినినవరుగూడ ఎందరొ దానిని గ్రహించలేరు. దాని గురించి విని దాన్ని గ్రహించగలిగిన వాడే నిజంగా అద్భుతమైన వాడు. అతి సూక్ష్మ బుద్ధి కలవాడు.
శాశ్వత వస్తువు అశాశ్వత వస్తువులచేత ఎన్నటికిని పొందబడదు గనుక ఈ సంపదలన్నియు అనిత్యాలని నాకు తెలుసు. అయిన ఈ అనిత్య వస్తువులతో నేను నచికేతాగ్నిని నిర్వర్తించాను. (తద్వారా) శాశ్వత వస్తువును పొందాను.
ఓ నచికేత దీమంతుడవైన నువ్వు ద్రుడనిశ్చయంతో తిరస్కరించావు. అందువలన నేను నీకు చెప్పుచుంటిని దాని గురించి. అది (ఆత్మ)ఈ శరీరంలోనే వున్నది, హృదయంలో ఆసీనమై ఉన్నది, సనాతనము అతి సూక్ష్మము అంతర్లీనము జ్యోతిర్మయము అయిన ఆ ఆత్మను ధ్యానము ద్వార సాక్షాత్కరించుకొని ధీశాలి సుఖ దుఃఖాలకు అతీతుడవుతాడు.
ధర్మానికి ప్రాణమైన ఆ సుక్ష్మతత్వాన్ని విని తగిన విధంగా అలోచించి చక్కగా గ్రహించిన మానవుడు దానిని పొందుతాడు. ఆనందించదగిన దానిని పొందడంచేత ఆనందపరవశుడవుతాడు. నచికేతునికి ఇది తెరచిన ఇల్లే అని నేను భావిస్తున్నాను.
ధర్మాధర్మాలకు కార్యకారణాలకు భూత భవిష్యత్తులకు కూడా భిన్నంగా నువ్వు దేన్నీ సాక్షాత్కరించుకున్నవో దాన్ని దయచేసి నాకు ఉపదేశించు.
అన్ని వేదాలు ఘోషించే గమ్యము అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యము ఐన దేన్నికోరి సాధువులు బ్రహ్మచర్య గడుపుతారో దాన్ని సంగ్రహంగా చెపుతున్నాను విను.
అదే ఓంకారం. ఈ అక్షరమే బ్రహ్మము. ఈ అక్షరమే సర్వోత్తమము కూడా. ఈ అక్షరాన్ని తెలుసుకున్నవారికి ఏది కోరితే అది సిద్దిస్తుంది.           
జ్ఞాన ఐన ఆత్మ పుట్టదు. చావదు. దేని నుంచిగాని అది పరిణమించదు. శరీరం నశిస్తూ ఉన్నప్పుడు కూడా జన్మరాహిత్యము ఆ నశ్వరము శాశ్వతము సనాతనము ఐన ఈ ఆత్మకు నాశనమనేది లేదు, ఆత్మ చంపబడదు.
సుక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటే చిన్నదీ బ్రహ్మాండాని కంటె ఘనమైనది ఐన ఆత్మ ప్రాణుల హృదయాలలోనే ఉన్నది. కామరహితుడు శోకరహితుడై ఇంద్రియాలయొక్క మనస్సు యొక్క పవిత్రత ద్వార ఆత్మ మహిమను సాక్షాత్కరించుకుంటాడు.
కదలకుండా కూర్చునే వున్నా అతడు ఎంతోదూరం ప్రయాణిస్తాడు. పడుకునే ఉన్నా అతడు సకల ప్రదేశాలకు పోతాడు. ఆనందమయుడు ఆనందరహితుడు ఐన ఆ జ్యోతిర్మయుడిని తెలుసుకోన సమర్ధుడై ఉన్నాడు.
శరీరరహితము సర్వవ్యాపి ఐన పరమాత్మను అస్తిరములైన అన్ని శరీరలలోను వున్నది అని తెలిసికొని ప్రజ్ఞావంతుడు శోకింపడు.
వేదాధ్యయన చేతగాని బుద్ధి కుసలచేతగని అపారమైన పాండిత్యము చేతననైనగాని ఈ ఆత్మ పొందబడదు. అది ఎవరిని వర్తిస్తుందో ఎన్నుకుంటుందో అతనిచేతనే ఆత్మ పొందబడుతుంది. అంటే అతనియోక్క ఆత్మే తనయొక్క నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది. దీనిని ధ్యానము ద్వార నీ హృదయంలోనే దర్శించుకోవచ్చు లేకపోతె జ్ఞానము ద్వార కూడా ఈ సమస్తాన్ని పరమాత్మగా భావించి ఆత్మానుభూతి పొందవచ్చు.
దుష్ప్రవర్తనము నుండి విరమించనివారు, శాంతిలేనివారు, ఏకాగ్రచిత్తములేనివారు, అశాంతమానసులు ప్రజ్ఞచే నైనను ఆత్మను బడయజాలరు.
ఓ నచికేత, ఆత్మ దాన్ని అధిరోహించిన యజమాని అని తెలుసుకో . అలాగే శరీరము రథము బుద్ధే సారధి మనస్సు కళ్లము అని గ్రహించు.ఇంద్రియలె గుర్రాలు ఇంద్రియ విషయాలే అవి పరుగులుతీసే మార్గాలు అని అంటారు. శరీరము ఇంద్రియాలు మనస్సులతో కూడివున్న ఆత్మనే ప్రాజ్ఞులు భోక్తగా చెపుతారు.
మనస్సును విచ్చలవిడిగా వదిలేసి సరైన జ్ఞానం లేకుండా ఎవరైనా ఎల్లప్పుడూ సంచరిస్తే అలాంటివాని ఇంద్రియాలు దోషం వున్న గుర్రాలు అదుపుతప్పి పోయినట్లే వశం తప్పిపోతాయి.
అయితే ఎల్లప్పుడూ మనస్సును అదుపులో వుంచుకొని సరైన జ్ఞానంగలిగి ప్రవర్తించే వాని ఇంద్రియాలు సారధియొక్క మంచి గుర్రాల వలె తన వశంలో ఉంటాయి.
సరైన జ్ఞానంలేక చెదిరిపోయిన మనస్సుతో ఎల్లపుడు అశుచిగా ఉండేవాడు ఆ గమ్యాన్ని పరమ పదాన్ని ఎన్నటికి పొందలేడు. అంతేగాక జననమరణ చక్రరూపమైన సంసారంలో పడిపోతాడు.
కానీ ఎవడైతే విజ్ఞానవంతుడో వశముచేసుకొన్న మనస్సు గలవడో సదా పరిశుద్దుడో అతడు పునర్జన్మలేని ఆ పరమపదాన్ని చేరుకుంటాడు.
బుద్ధే సారధిగాగలవాడు మనస్సే చాకచక్యంతో పట్టుకోబడిన కల్లెమైనవాడు అయిన మానవుడు ప్రయాణపు గమ్యమైన విష్ణువుయొక్క పరమపదాన్ని(సర్వవ్యాపక పరమాత్మ అయిన పరంధామున్నే) చేరుకుంటాడు.
ఇంద్రియములకంటె పదార్థములు గొప్పవి. పదార్తములకంటె మనస్సు గొప్పది. మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధి కంటే మహత్తరమగు ఆత్మ (హిరణ్యగర్భుడు) గొప్పది. మహత్తరమైన ఆత్మ కంటె అవ్యక్తము గొప్పది. అవ్యక్తముకంటె పురుషుడు (పరమాత్మ) గొప్పవాడు. పురుషునికంటె గొప్పది మరి ఏదియులేదు. అదియే అన్నిటికిని పరాకాష్ట. అదియే పరమగమ్యము. 
సమస్త ప్రాణులందును నిగూడముగా నుండుటచే ఈ ఆత్మ అందరకును కనుపించుట లేదు. కాని సూక్ష్మదర్శులు వారికి తమ సూక్ష్మబుద్దిచే ఈ ఆత్మ కనుపించుచున్నది. 
ప్రజ్ఞావంతుడు వాక్కును మనస్సునందు, మనస్సును బుద్దియందును, బుద్దిని మహాదాత్మయందును, మహాదాత్మను శాంతమగు అత్మయందును నిమగ్నము చేయవలెను.
లెమ్ము! మేలుకొనుము. ఉత్తములగు గురువులను సమీపించి ఆత్మనుగూర్చి తెలిసికొనుము. ఆ మార్గము కత్తియొక్క పదనైన అంచువలె దాటుటకు కష్టమైనదని పెద్దలు చెప్పుదురు. 
శబ్దస్పర్శ రూపగంధాలు లేనిది నాశరహితమైనది శాశ్వతము ఆదీ అంతు లేనిదీ మహాత్తుకు అతీతమైనిది ద్రువమైనది అయిన ఆత్మను ఎవరు హృదయంలో సాక్షాత్కరించుకుంటారో అట్టి మానవుడు మ్రుత్యువునుండి విముక్తి పొందుతాడు.
స్వతః సిద్దుడు స్వయంగా ఆవిర్భవించినవాడు అయిన భగవంతుడు ఇంద్రియాలను దోషపురితలుగా సృష్టించాడు. అందుచేత అవి బయటి విషయాలవైపు మాత్రమే పోగలవు. లోపల ఉన్న ప్రత్యగాత్మను అవి దర్శించలేవు. ప్రయత్నముతో ఎవరో ఒక ధీరుడు అమృతత్వాన్ని కోరి తన కళ్ళను లోపలి మరల్చుతాడో అట్టి వాడు మాత్రమే అంతరాత్మను దర్శిస్తాడు.
పసిబాలురు(అజ్ఞానులు) బహ్యసుఖాల వెంటపడతారు. అలా వారు అపారమైన మృత్యువు వలలో పడిపోతారు. కానీ ప్రాజ్ఞులు ఏ అనిత్య విషయాలమద్య నిత్యమూ శాశ్వతము అమరము అయిన దేదో తెలుసుకొని ఈ ప్రపంచంలో దేనిని కూడా కోరరు.
స్వప్నావస్థలో జాగ్రదావస్థలో అన్ని విషయాలను ఏ ఆత్మ ద్వార తెలియబడుచున్నవో, అట్టి సర్వవ్యాపియగు మహత్తరమైన అయిన ఆత్మను సాక్షాత్కరించుకొని ప్రాజ్ఞుడు ఇక దుఃఖించడు.  
తేనెను అస్వాదిస్తున్నది జీవితాన్ని పోషిస్తున్నది భూతభవిష్యత్తులకు ప్రభువు అయిన ఆత్మను చాల దగ్గరగా తెలుసుకున్నవాడు ఆ తరువాత ఇక భయం చెందడు .
పూర్వం జ్ఞానానికి జన్మించినవాడు నీటికంటే ముందుగ వున్నవాడు అయిన ఆత్మ అది హృదయంలో ప్రవేశించి పంచాభుతలతో ఉంటున్నదని దర్శించినవాడు నిజంగా బ్రహ్మన్నే దర్శిస్తాడు.
ప్రాణరూపంగా కనబడేది పంచాభుతలతో సృస్టించబడినది హృదయంలో ప్రవేశించి నివసించేది అయిన ఆత్మని పరమాత్మగా తెలిసికోన్నవాడే నిజంగా బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు.
ఏది (ఏ ఆత్మ) ఇచట (ఈ లోకమున) ఉన్నదో, అదియే అచటను (పరలోకమునను) కలదు. ఏది అచట కలదో, అదియే ఇచ్చతను ఉన్నది. ఇచట భేదబుద్ది ఎవనికి కన్పించునో, అతడు మాటిమాటికి మృత్యువును పొందును.

మనస్సు ద్వారానే దీని సాక్షాత్కరించుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏ వైవిధ్యము వుండదు. ఇక్కడ వైవిద్యం వున్నట్లు చూచే వాడు మరణాన్నుంచి మరణానికి పోతువుంటాడు. అట్టివానికి జనన మరణాలు తప్పవు.
బొటనవ్రేలి పరిమాణంగల పురుషుడు ఈ శరీరంలో నివసిస్తూ వుంటాడు. భూత భవిష్యత్తులకూ ఆయనే ప్రభువు. ఇది తెలిసి మానవుడు భయపడడు. భూత భవిష్యత్తులకు అధిపతియగు పురుషుడు పొగలేని అగ్నివంటివాడు, ఈనాడు, రేపుగూడ భేదారహితుడైన ఇతడే కలడు. ఇతడే ఆ ఆత్మ.
నచికేతా! నిర్మలమగు జలము నిర్మలమగు జలమందు పడి దానితో ఏకమగునట్లు జ్ఞానముకల మునియొక్క ఆత్మకూడ బ్రహ్మమే యగుచున్నది. 
జన్మరహితుడు అకుంటిత ప్రజ్ఞావంతుడు అయిన ఆత్మకు పదకొండు ద్వారాలుగల పట్టణం వున్నది. ఆ ఆత్మను ధ్యానించిన వానికి దుఃఖము లేదు. అన్ని అజ్ఞానబంధాలనుండి విముక్తుడై జన్మమ్రుత్యుబంధనాలనుండి కూడా స్వేఛ్చ పొందుతాడు. 
శరీరంలో నివసించేవానికి చెందినది. శరీరంనుండి అతడు వేరు చేయబడిన తరువాత ఇక్కడ ఏది మాత్రం మిగులుతుంది ? ఇది నిజంగా ఆ ఆత్మ. మనవులెవరు ప్రాణం చేతగాని అపానం చేతగాని జీవించడు. ఈ రెండూ ఆధారపడి వుండే మరొక దానిచేత జీవిస్తాడు , అదే ఆత్మ.
సమస్తమును తన వశమందుంచుకొని సమస్త ప్రాణులకును అంతరాత్మ అయియున్న ఆత్మ తన ఏకైక రూపమును అనేకవిధములుగా భాసింపచేయుచున్నది. తన అత్మయందలి ఈ తత్త్వమును దర్శించు జ్ఞానులకు మాత్రమే శాశ్వతసుఖము కలుగుచున్నది.  
ఓ గౌతమా ఇక నీకు ఆ రహస్యము సనాతనము అయిన బ్రహ్మాన్ని గూర్చి చెబుతాను. అలాగే చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను.
కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్బంలో ప్రవేసిస్తాయి. మరీ కొన్ని జీవాత్మలు చెట్టు చేమలనాశ్రయిస్తాయి. అంటే వారి కర్మ ననుసరించి జ్ఞానాన్ని అనుసరించి వుంటుంది.  
అనిత్య వస్తువులలో నిత్యవస్తువు చైతన్యవంతమైన వానిలోను చైతన్యము ఒక్కటే అయినా అనేకుల కోరికలు నేరవేర్చేది అయిన పరమాత్మను తమ అత్మయందే స్తితమై వున్న దానినిగా ఏ ప్రాజ్ఞులు దర్సిస్తారో వారిదే శాశ్వతమైన శాంతి. ఇతరులది కాదు.
నిజంగా అవ్యక్తనికంటే మించినది సర్వవ్యాపి సర్వ లక్షణ రహితము అయిన పురుషుడే. ఆ పురుషుని సాక్షాత్కరించుకోవడం చేత మానవుడు ముక్తుడై అమరుడవుతాడు.
అతని రూపం చూపు మేరలోలేదు. కన్నులతో ఎవడు అతనిని చూడలేదు. హృదయంలో వుంది మనస్సును శాసించే బుద్ధి యొక్క స్పుర్తిచేతనే అతడు ప్రకటితమవుతాడు. అతనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.
మనస్సుతోసహా పంచేద్రియాలు ఎప్పుడు ఆత్మలో నిశ్చలంగా నిలిచిపోతాయో బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలమైపోతుందో అప్పటి స్తితినే పరమపదమని అంటారు.
స్థిరమగు ఇంద్రియధారణనే యోగమని యెంచెదరు. అట్టి స్థితియందు యోగి అప్రమత్తుడై యుండవలెను. ఈ యోగమును పొందవచ్చును. అజాగ్రత్తచే పోగొట్టుకొనవచ్చును.
శాశ్వతమైన ఆత్మే సత్తు అదే అసలు తత్వంగా సాక్షాత్కరించుకోవాలి. అలా ఆత్మను హృదయంలో సాక్షాత్కరించుకున్నవానికి అసలు తత్వం ప్రత్యక్షమవుతుంది.
హృదయంలో దాగివున్న సకల వాంఛలు నిర్ములించబడినపుడు మరనసీలియైన మానవుడు అమరుడవుతాడు. ఈ శరీరం ఉండగానే బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు.హృదయ గ్రందులన్నియు ఎపుడు చేధింపబడునో అపుడు మనుజుడు అమ్రుతుడగుచున్నాడు .
నిర్దేశింప శక్యము గానిదియు, పరమమైనదియు నగు సుఖమును ఇదియే ఆ ఆత్మ అని విజ్ఞులు భావింతురు.
అక్కడ (ఆ ఆత్మయెద్ద) సుర్యుడుకాని, చంద్రుడు కాని, నక్షత్రములు కాని, మెరుపులు కాని ప్రకాశింపవు. ఇక ఈ అగ్ని విషయము వేరుగా చెప్పవలయునా! ఆ ఆత్మ ప్రకాశించుటవలననే దానిని ఆశ్రయించుకొని తక్కినవన్నియు ప్రకాశించుచున్నవి. దాని ప్రకాశముచే ఇదియంతయు ప్రకాశించుచున్నది. 
ఈ ఆత్మయొక్క భయమువలననే అగ్ని మండుచున్నది, సూర్యుడు ప్రకాశించుచున్నాడు, ఇంద్రుడు, వాయువు, ఐదావవాడగు మృత్యువు తమ తమ విధులను చక్కగా నిర్వర్తించుచున్నారు.
శరీరము పడిపోవక పూర్వమే ఈ ఆత్మను తెలికొనువాడు సంసారబందమునుండి విముక్తుడగుచున్నాడు. అట్లు తెలిసికోననిచో అతడు మరల శరీరమును ధరింపవలసివచ్చును(పునర్జన్మను పొందవలసివచ్చును).

అంతరాత్మ అయిన పురుషుడు బొటన వ్రేలంతవాడు సర్వదా ప్రాణుల హృదయాలలో నివసిస్తువుంటాడు. ముంజగడ్డినుండి దర్భను వేరుచేయునట్లు మనుజుని శరీరంనుండి అతన్ని(ఆత్మను) లోపలి పోచనులాగ వేరుచేయాలి. అతడే పరిశుద్దుడు అమరుడు అని తెలుసుకోవాలి. అవును అతడే పరిసుద్దుడు అమరుడు.

No comments:

Post a Comment