Thursday, April 3, 2014

36. వజ్రసూచికోపనిషత్తు :

సచ్చిదానందస్వరూపమైనదియు, సర్వుల బుద్ధివృత్తులకు సాక్షియైనదియు, వేదాంతవేద్యమైనదియు, అనంతరూపమైనదియు నగు బ్రహ్మమునకు నమస్కారము.

అద్వైతమును, జాతిగుణక్రియలు లేనిదియు, పుట్టుట, పెరుగుట మొదలైన షడ్భావవికారములు లేనిదియు, నిర్ధోషమైనదియు, సత్యజ్ఞానానందస్వరూపమైనదియు, నాశరహితమైనదియు, వికల్పరహితమైనదియు, ఎన్నియో కల్పములకు ఆధారమైనదియు, సర్వభుతాంతర్యామియు, ఆకాశమువలె లోపల వెలుపల వ్యాపించినదియు, అనంతానందస్వభావయుక్తమైనదియు, ఉహకు అందనిదియు, అనుభవముచే తెలుసుకొనదగినదియు, ప్రత్యక్షముగా గోచరించునదియు నగు పరమాత్మను కరతలామలకమువలె సాక్షాత్తుగా సందర్శించి క్రతార్థతను జెంది కామరాగాది దోషములులేనివాడై శమదమాది దైవగుణసంపన్నుడై, మాత్సర్యము, తృష్ణ, ఆశ, మోహము, దంభము, అహంకారము మొదలైన దుర్గుణములు లేనివాడై యుండువాడే, ఇట్టి పుర్వోక్తలక్షణములు కలిగియుండువాడే బ్రాహ్మణుడని వేద, శాస్త్ర, పురాణ, ఇతసముల యొక్క అభిప్రాయము. ఇట్టి లక్షణములు కలిగియుండుటచేతప్ప మరియొక విదముగా బ్రాహ్మణత్వము సిద్ధింపదు. సచ్చిదానందమై అద్వయమై ఆత్మరూపమైనట్టి బ్రహ్మమును ధ్యానించవలయును.

35. శుకరహాస్యోపనిషత్తు:

జీవుడు దేనిని చూచుచున్నాడో, వినుచున్నాడో, వాసన చూచుచున్నాడో, మాట్లాడుచున్నాడో, రుచిచూచుచున్నాడో అదియే ప్రజ్ఞానమని చెప్పబడినది.
బ్రహ్మదేవునియందును, ఇంద్రాదిదేవతలందును, మనుషులందును; గుఱ్ఱము, ఆవు మొదలైన వానియందును ఏకమైన చైతన్యమే బ్రహ్మము. అందుచే నాయందలి చైతన్యము కూడ బ్రహ్మయగును.
పరిపూర్ణమైన పరమాత్మాజ్ఞానమును లొందుటకు యోగమైన ఈ మనుష్యశరీరమునందు, బుద్దికి సాక్షిగా, నిర్వికారమున ప్రకాశించుచున్నదై పరమాత్మ అహమ్ (నేను) అను పదము చెప్పబడుచున్నది.
స్వయముగా పరిపూర్ణమైన పరమాత్మ మహావాక్యమునందు బ్రహ్మమను పదముచే చెప్పబడినది. అస్మి అను పదము జీవ బ్రహ్మైక్యమును తెలుపుచున్నది. అందుచే నేను బ్రహ్మమునే అగుదును.
సృష్టికి పూర్వము నామరూపములు లేనిది, ఏకమైనది అద్వితీయమైనది అగు ఏ సద్వస్తువు కలదో, ఆ సద్వస్తువునకు ఇప్పుడును విచారణచే తత్వముద్వార ఆ స్వభావమే చెప్పబడుచున్నది.
జీవుని యొక్క శరీర, ఇంద్రియాదులకంటె అతీతమైన సద్వస్తువు మహావాక్యమునందు త్వం పదముచే చెప్పబడినది. అసి అను పదముచే ఐక్యము గ్రహింపబడుచున్నది. అట్టి తత్, త్వం పదార్థముల యనుభవమును ముముక్షువు లనుభవింతురు గాక!
అయమ్ అను పదముచే ఆత్మ స్వయం ప్రకాశమైన ప్రత్యక్షమైనది అను అర్థము చెప్పబడినది. అది అహంకారః ఆదిగా గలిగి స్థూల శరీరము నంతముగా గల జగత్తునకంటె విలక్షణమైన ప్రత్యగాత్మయని చెప్పబడుచున్నది.
దృశ్యజగత్తునకెల్ల అధిష్టానమైన వరతత్త్వము బ్రహ్మ శబ్దముచే చెప్పబడుచున్నది. ఆ బ్రహ్మము స్వయంప్రకాశముమైన ప్రత్యగాత్మరూపమే యగును.
జీవుడు కార్యోపాది, ఈశ్వరుడు కారణొపాది కార్యకారణములను విడనాడినచో పూర్ణబోధయే(ఆత్మయే) శేషించును.

ఇతరవిద్యలయొక్క పరిజ్ఞానము అనశ్యము నశ్వరమైన బ్రహ్మవిద్య యొక్క పరిజ్ఞానము బ్రహ్మమును సంప్రాప్తి చేయును.

Monday, March 31, 2014

34.నిరాలంబోపనిషత్తు:

గురుస్వరూపుడును, సచ్చిదానంద మూర్తియును, ప్రపంచ రహితుడును ,శాంతుడును, ఆధారరహితుడును, జేజోరూపుడును అగు శివునకు (మంగళస్వరూపమగు పరమాత్మకు) నమస్కారము.
నిర్గుణబ్రహ్మమును ఆశ్రయించి సగుణకారమును ఎవడు త్యజించునో అతడే సన్యాసి, అతడే యోగి. అట్టివాడు మోక్ష పదము నొందును.                   
అద్వితీయమైనదియు, సకలోపాధివినిర్ముక్తమైనదియు, సర్వశక్తిసంపన్నమైనదియు, ఆదిఅంతములు లేనిదియు, శుద్దమైనదియు, మంగళకరమైనదియు, శాంతమైనదియు, నిర్గుణమైనదియు, అనిర్వచనీయమైనదియు నగు చైతన్యమే బ్రహ్మము.
ఈ సమస్తము బ్రహ్మమే. ఇచట అనేకత్వమొకింతైనను లేదు.       
శరీర, ఇంద్రియ సంశయముచేతను సద్గురూపాసనచేతను ,శ్రవణమనన నిధిధ్యాసములచేతను, ద్రుగ్ద్రశ్యస్వరూపమైనదంతయును సర్వాంతర్యామియై యున్నది. సర్వ సమానమైనది. ఘటపటాది వికారవస్తువులందు వికారరహితమైనది యగు చైతన్యము తప్ప వేరొకటి ఏదియు నిచట లేదను సాక్షాత్కారానుభావమే జ్ఞానము.
త్రాటియందు సర్పభ్రాంతివలె కేవలము సర్వాంతర్యామి సర్వస్వరూపపమునగు బ్రహ్మమునందు దేవతలు, పశువులు, మనుష్యులు, స్త్రీలు, పురుషులు, వర్ణాశ్రమములు, బంధమోక్షములు అను అనేక భేదములచే కల్పితమైన జ్ఞానమే అజ్ఞానము.
అనాత్మరూపములైన విషయములయొక్క సంకల్పమే దుఃఖము.
సజ్జనుల సాంగత్యమే స్వర్గము.
అసత్తైన సంసారముయొక్క విషయములందు ప్రవ్రుత్తులైన అజ్ఞానులతోడి సాంగత్యమే నరకము.
అనాదియగు అజ్ఞానము యొక్క వాసనచే నేను జన్మించినవాడను అను ఈ ప్రకారములైన సంకల్పములు కలిగియుండుటయే బంధము. తల్లిదండ్రులు, సోదరులు, భార్య, బిడ్డలు, గృహము, ఉద్యానము, పొలము మొదలైన వానియందు మమత్వము కలిగి యుండి సంసారముయొక్క ఆవరణమును గూర్చి సంకల్పము కలిగి యుండుటయే బంధము.
కర్త్రుత్వాదులు, అహంకారము వీనిని గుర్చిన సంకల్పమే బంధము. కేవలం సంకల్ప మాత్రమె బంధము.
నిత్యానిత్య వస్తువిచారణచే అనిత్యములైన సంసార సుఖదుఃఖ విషయములగు సమస్త వస్తువులందును మమకారము నశించుటయే మోక్షము.
సర్వజీవుల శరీరములందున్న చైతన్య బ్రహ్మమును పొందించు గురువు ఉపాసింపదగినవాడు.    
సర్వుల అంతరంగమున ఉన్న చిద్రూపమును (ఆత్మను) ఎరిగినవాడే విద్వాంసుడు.
కర్త్రుత్వాది అహంకారభావము గూఢిపడినవాడు మూఢుడు.         
బ్రహ్మము సత్యము ,జగత్తు మిధ్య అను అపరోక్షజ్ఞాన రూపముగు అగ్నిచే బ్రహ్మాద్వైశ్వర్యవాంఛయొక్క సంకల్పమును సముహముగా దగ్ధ మొనర్చుటయే తపస్సు.
ప్రాణము, ఇంద్రియములు మొదలైనవానికంటెను; అంతఃకరణముకంటెను, త్రిగుణములకంటెను, పరమైనదియు, సచ్చిదానంద స్వరూపమైనదియు, సర్వమునకు సాక్షియైనదియు; నిత్యముక్తమైనదియునగు బ్రహ్మముయొక్క స్థానము పరమపదము.
దేశ కాలవస్తు పరిచ్చేదరహిత చిన్మాత్రస్వరూపమే గ్రహింపదగినది.         
స్వస్వరూప వ్యతిరిక్తమైనదియు, మాయామయములగు బుద్ధీంద్రియములకు గోచరమైనదియు నగు జగత్తు సత్యమను చింతనము గ్రహింపదగినది కాదు.

ప్రాపంచికవిషయములనెల్ల పరిత్యజించి నిర్మముండు, నిరహంకారుండునై, తన కిష్టమగు బ్రహ్మమును శరణుజొచ్చి, తత్త్వమసి, అహంబ్రహ్మస్వి, సర్వంఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తేకించన మొదలైన మహావాక్యముల యొక్క అర్ధమును అనుభవమునకు తెచ్చుకొనుటవలన నేను బ్రహ్మమునే యగుదును అని నిశ్చయముగా నెరింగి నిర్వికల్ప సమాధితోగూడి స్వతంత్రుడై యతి సంచరించుచుండును. అతడే సన్యాసి. అతడే ముక్తుడు. అతడే పూజ్యుడు, అతడే యోగి, అతడే పరమహంస. అతడే అవధూత, అతడే బ్రాహ్మణుడు.

3౩. సర్వసారోపనిషత్తు :

జీవుడు అనాత్మరూపములగు దేహాలను ఆత్మగా తలంచుచు అభిమానించుచున్నాడు. ఆ దేహాభిమానమే ఆత్మకుబంధము. అది తోలగుటయే మోక్షము. అట్టి అభిమానమును కలుగజేయు నది అవిద్య. అట్టి అభిమానము తొలగిపోవునో అదియే విద్య.
నేను ప్రాణరహితుడను, మనోరహితుడను, పరిశుద్దుడను. బుద్ధి మొదలైనవానికి సదా సాక్షి భూతుడను. నేను సదా నిత్యుడను, చిన్మాత్రుడను. ఇట స,సంశయ మేమియును లేదు.
నేను స్థానువును (నిశ్చలుండను), నిత్యుడను, సదా ఆనంద స్వరూపుడను ,శుద్దుడను, జ్ఞానస్వరూపుడను, నిర్మలుడను. నేను సమస్త ప్రాణులయొక్క ఆత్మను, సర్వవ్యాపకుడను ,సాక్షిని. ఇందు సంశయము లేదు.
సర్వ వేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేను కాను .నేను నామములను కాను. కర్మలు కాను. సచ్చిదానందమైన బ్రహ్మమును నేను.

నేను దేహమును కాను. కావున జననమరణములు ఇక నా కెచట? నేను ప్రాణమును కాను. కావున ఆకలిదప్పికలు ఇంకా నీ కెచట ? నేను చిత్తమును కాను. కావున శోకమోహములు ఇక నా కెచట? నేను కర్తను కాను. కావున బంధమోక్షములు ఇక నా కెచట?

31. క్షురికోపనిషత్తు ; 32. మన్త్రికోపనిషత్తు :

31. క్షురికోపనిషత్తు :
సాధకుడు నిషబ్దముగానున్న ప్రదేశమున సముచితమైన ఆసనము వేసికొని కూర్చుండి తాబేలు తన అవయవములను ఉపసంహరించుకొనునట్లు సర్వెంద్రియములను విషయములనుండి మరలించి, మనస్సును హృదయమునందు నిశ్చలముగా నిలిపి, పండ్రెండు దాత్రలుగల ప్రణవ మంత్రముతో మెల్లమెల్లగ సర్వాత్మను దారించవలెను.
ఇంద్రియములను అన్నిటిని నిగ్రహించి, నిజిరచిత్తుడై, నిశబ్దమైన ఏకాంతవాసమునందు సంగరహితుడై, సాంగయోగము నెరిగినవాడై, నిరపేక్షుడై, మెల్లమెల్లగా పాశమును త్రెంచుకొని ఎగిరిపోవు హంసపక్షివలె జీవుడు చిన్నపాశుడై సంసారమును దాటి మోక్షధామమును జేరి సుఖించును.
కామబంధమునుండి నిముక్తుడైన వెంటనే జీవుడు సర్వకామరహితుడై, సంసారపాశములను చేధించి అమ్రుతత్వమును (మోక్షమును) పొందును. మరల అతడు బంధమును పొందడు.
32. మన్త్రికోపనిషత్తు :

ఎవని యందు ఈ చరాచర జగత్తు కూర్చబడినదో, ఆ పరిశుభ్రమైన, సర్వవ్యాపకమైన ,అద్వితీయమైన పరమాత్మను బ్రహ్మనిష్టులు దర్శించుచుందురు. మఱియు నదులు సముద్రము నందువలె అతనియందు లయమును బొందుచుందురు.

౩౦. సుబాలోపనిషత్తు :

శరీరము లోపల హృదయగుహయందు అజుడు, నిత్యుడు, అద్వితీయుండు నగు పరమాత్మా కలడు. అతనికి ప్రుథివి శరీరము. అతడు ప్రుథివిలో సంచరించును. కాని అతనిని ప్రథివి ఎరుగనేరదు. అట్లే అతనికి జలము శరీరము. అతడు జలమునందు సంచరించును .కాని జల మాతనిని ఎరుగలేదు.
ముముక్షువు శాంతుడు ,దాంతుడు, ఉపరతుడు. తితిక్షువు సమాధినిష్టుడుగ నయి తన అంతరాత్మయందే పరమాత్మను దర్శించుచున్నాడు. ఆ పరమాత్మ నెరిగిన విజ్ఞుడు సర్వముయోక్క ఆత్మయగుచున్నాడు.

బ్రహ్మనిష్టుడు మహత్తరమగు అత్మపదము నెరిగినవాడై వృక్షముక్రింద నివసింపవలయును. వైరాగ్యశీలుడు, వివేకవంతుడు, ముముక్షువు నగు ఆ విజ్ఞుడు పరిమితవస్త్రమును ధరించిన వాడై,  అన్యసహాయము లేనివాడై, ఏకాకియై, సమాధినిష్టుడై, ఆత్మకాముడు, ఆప్తకాముడు, నిష్కాముడు, జీర్ణకాముడునై ఏనుగునందును, సింహమునందును, ఈగనందును, దోమయందును, ముంగిసయందును, గంధర్వునియందును భగవంతుని యొక్క రూపములు తెలిసికొని దేనివలనను భయముజెందని వాడై యుండును. చేదింపబడుచున్న వాడైనను వ్రుక్షమువలె క్షమాశీలుడై కోపముంజెంచక యుండవలెను. సత్యశీలుడై యుండవలెను. పరమాత్మ సత్యస్వరూపమైనది.

29. మైత్రేయోపనిషత్తు:

(శిష్యుడు గురువుతో నిట్లనెను) మహాత్మా! చెరువులోని గ్రుడ్డికప్పవలె నేను ఈ సంసారమందున్నాను. నన్ను ఉద్దరింపుడు. ఈ ప్రపంచమున నాకు మీరే దిక్కు.
గురువు మనుజునకు దృశ్య విషయములందు మనస్సు ఏ విధముగా ఆసక్త మగుచుండునో, ఆ ప్రకారముగ బ్రహ్మమునందు ఆసక్తమగునో, అప్పుడిక ఎవడు బంధమునుండి విదివడకుండును?
బుద్దివ్రుత్తులకు సాక్షియు, పరమ ప్రేమామూర్తియు నగు పరమేశ్వరుని హృదయకమల మధ్యమందు భావనచేయవలెను.
మనుజునకు ఏది ఆనందసముద్రమో అదియే నేను. ఆ ఆనంద సముద్రము మనోబుద్దుల కంటే పరమైనది. ఇందు సంశయము లేదు.
అంతరంగమున ఆనందమును ఆశ్రయించువాడను, ఆశయను పిశాచమును అవమానపరచువాడను, ఈ జగత్తును ఇంద్రజాలము (గారడీ) వలే గాంచువాడను, అసంగుడను అగు నాకు ఆపదయెట్లు కలుగగలదు?
దేహము దేవాలయమని చెప్పబడినది. జీవుడు కేవలము శివుడే అయియున్నాడు. అజ్ఞానము నిర్మాల్యమును తొలగించి సోహం భావనచే (ఆ పరమాత్మనే నేను అను భావనచే) పూజించవలెను.
అభేధదర్శనమే జ్ఞానము. మనస్సును నిర్విషయముగ (విషయసంకల్పము లెవ్వియులేక) నున్చుతయే ధ్యానము. మనస్సు నందలి మాలిన్యమును, అపవిత్రతను తొలగించుటయే స్నానము. ఇంద్రియనిగ్రహమే శౌచము.
బ్రహ్మానందమను అమృతమును త్రాగవలెను. దేహ సంరక్షణ కొఱకు బిక్షాటన మాచరింపవలెను. ద్వైతవర్జితమగు ఏకాంతమున వసించవలెను. ఈ ప్రకారముగా బుద్ధిమంతుడు ఆచరించినచో మోక్షమును బడయగలడు.
ఈ దేహము పుట్టునదియు, చచ్చునదియు అయియున్నది. ఇది మాతాపితృ మలస్వరూపమైనది. సుఖదుఃఖములకు నిలయమైనది. అపవిత్రమైనది.
చర్మము, మాంసము, ఎముకలు మొదలైన ఏడూ విధములైన ధాతువులతో కూడినదియు, మహారోగగ్రస్తమైనదియు, పాపనిలయమైనదియు, అస్తిరమైనదియు, వికారములతో కూడిన ఆకారము కలదియు నగు ఈ దేహమును తాకినచో స్నానము చేయవలెను.
సదా స్వభావముగానే తొమ్మిది రంధ్రములనుండి మలమును స్రవించునదియు, దుర్గంధముతోను, దుర్మలములతోను కూడినదియుగను ఈ శరీరమును తాకినచో స్నానము చేయవలెను.
మాత్రుసూతకముతో సంబందము కలదియు, సూతకముతో పుట్టినదియు, మృతసూతకమును కలుగజేయునదియు నగు ఈ దేహమును తాకినచో స్నానము చేయవలెను.
నేను నాదియను అజ్ఞానమువలని అశౌచమును తొలగించుకొనుట శుద్ధశౌచమని చెప్పబడినది. కేవలము మట్టితోను, నీటితోను కలుగజేసికోను శౌచము లౌకికశౌచమే యగును.
వాసనాత్రయమును (లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అను మూడింటిని) పోగొట్టుకొనుటయను శౌచము చిత్తమును శుద్ధ మొనర్చును. జ్ఞానమను మ్రుత్తికతోను, వైరాగ్యమను బలముతోను కడుగుటవలన అది శౌచమననడుచున్నది.
అద్వైతభావనయే భక్ష్యము (భోజనము). ద్వైతభావన భక్ష్యము కాదు. గురువు, శాస్తములు చెప్పిన భావము ప్రకారము సాధకుడు భిక్షువునకు భోజనము విధింపబడుచున్నది.
బుద్ధిమంతుడు సన్యాసానంతరము స్వస్థానమున విడచి ,కారాగారమునుండి విడువబడిన చోరునివలె స్వతః దూరముగ నివసింపవలెను.
ఎపుడు మనుజుడు అహంకారమను కుమారుని, ధనమను సోదరుని, మొహమను ఇంటిని ఆశయను భార్యను వదలివేయునో అపుడాతడు నిస్సంశయముగా ముక్తినోందును.
హృదయాకాశమునందు చిదాత్మయను సూర్యుడు సదా ప్రకాశించుచున్నాడు. అతడు అస్తమించుటలేదు, ఉదయించుటలేదు.
గురువాక్యములచే అద్వితీయమగు పరమాత్మా యొకటియే కలదు అను నిశ్చయము కలిగియుండుటయే ఏకాంతమని చెప్పబడినది కాని, మరముగాని, వసాంతరముగాని ఏకాంతములు కావు.
సంశాయరహితులైన వారికే మోక్షము కలుగును. సంశయగ్రస్తులైనవారికి జన్మజన్మాంతరమందను మోక్షము కలుగదు. కాబట్టి గురుశాస్త్రాదులందు విశ్వాసము కలిగియుండవలెను.
కర్మత్యాగము సన్యాసము కాదు. వ్రేషోచ్చారనమును సన్యాసము కాదు. జీవాత్మల యొక్క ఐక్యమే సన్యాసమని చెప్పబడినది.
సమస్తములైన విషయభోగములందు ఎవరికీ వామమాహారము (వాంతిఅన్నము) నందువలె హేయభావము కలుగునో, దేహభీమానరహితుడైన అట్టివానికే సన్యాసము నందు అర్హత కలదు.
సమస్త పదార్థముల యెడల ఎపుడు మనస్సునందు వైరాగ్యము కలుగునో, అపుడు మాత్రమె బుద్ధిమంతుడు సన్యసింప వలయును. లేకున్న పతితుడు కాగలడు.
డబ్బుకొరకుగాని, అన్నవస్త్రములకొరకుగాని, ప్రతిష్టకోరకుగాని సన్యసించినచో ఉభయ భ్రష్టుడు కాగలడు. అట్టి వాడు మోక్షమును పొందుటకు తగడు.
(బ్రహ్మ) తత్త్వచింతనము ఉత్తమమైనది. శాస్త్రచింతనము మధ్యమమైనది. మంత్రచింతనము అధమమైనది. తీర్థయాత్ర అధమాధమమైనది.
మూఢుడు అనుభూతిలేకయే బ్రహ్మమును గూర్చి వాచాచర్చలు సాగించి సంతోషించుచుండును. అట్టివాడు నీటిలో ప్రతిబింబించిన కొమ్మ చివరిపండ్లను భుజించి సంతోషించువానివలెనే ఉండును.
యతి మాధుకరము (భిక్షాటనము) అను తల్లిని, వైరాగ్యమను తండ్రిని, శ్రద్దయను భార్యను జ్ఞానమను కుమారుని వదలి పెట్టనిచో ముక్తుడగును.
ధనవ్రుద్దులు, వయోవ్రుద్దులు, విధ్యావ్రుద్దులు అందరును జ్ఞానవ్రుద్దునకు భ్రుత్యులే యగుదురు. ఇంతియే కాదు. అతని శిష్యులకును భ్రుత్యులే యగుదురు.
కొందరు పండితులైయున్నను నా మాయచేత మోహితమైన చిత్తముకలవారై, అంతట నిండియున్న ఆత్మనగు నన్ను పొందజాలక కేవలము ఉదరమును నింపుకొనుట కొరకై కాకుల వలె అచ్చటచ్చట సంచరించుచున్నారు.  
యతి శిలామయములును, లోహ మయములును, మణిమయములును ,మృత్తికామయములును అను విగ్రహములును కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షముకొరకై బహ్యార్చనమును విడచిపెట్టవలెను.          
సముద్రముసం దుంచబడిన నిండుకుండవలె పరమాత్మా లోపల, వెలుపల పరిపూర్ణమైనది. మఱియు ఆకాశమునం దుంచబడిన శూన్యఘటమువలె లోపల, వెలుపల (దృశ్య) శూన్యమైనది.
నీవు గ్రాహ్యపదార్థము కావలదు. గ్రాహకపదార్థమున్ను కావలదు. సమస్తభావనలను విడనాడి ఏది శేషించునో, అట్టి ఆత్మతో తన్మయుడవై యుండుము.
ద్రుష్ట, దర్శనము దృశ్యము అను త్రిపుటిని వాసనలతో గూడ విడనాడి ,సర్వదా ప్రకాశమానమైనట్టి కేవలము ఆత్మనే భజింపుము.
సమస్త సంకల్పములు నిశ్శేషముగా శమించినట్టియు, శిలవంటి స్థితిని పోలినదియు, జాగ్రద్దశ, నిద్రాదశ లేనిదియు నగు ఏ స్థితి కలదో, అదియే శ్రేష్టమైన (ఆత్మ) స్వరూపస్థితి అయియున్నది.
నేను అనేకత్వ భేదము లేనివాడను; అఖండానంద స్వరూపుడను, అహంకారము లేనివాడను ;నేను కాను (లేక దృశ్యపదార్ధమును కాను), నేను దేహాదిరహితుడను అయియున్నాను.
నేను సర్వత్ర పరిపూర్ణమైన స్వరూపము కలవాడను; సచ్చిదానంద స్వరూపుడను; సర్వ తీర్థ స్వరూపుడను, పరమాత్మను, శివ (మంగళ) స్వరూపుడను అయియున్నాను.
నేను అఖందానంద స్వరూపుడను, అఖండాకారరూపుడను, ప్రపంచరహితచిత్తుడను, ప్రపంచరహితుడను అయియున్నాను.
నేను సర్వప్రకాశరూపుడను, చిన్మాత్రజ్యోతిస్వరూపుడను కాలత్రయవర్జితుడను, కామాదిరహితుడను అయియున్నాను.
నేను గస్తవ్యమగు ప్రదేశము లేనివాడను, గమనాది రహితుడను, సదా సమరూపుడను, శాంతుడను, పురుషోత్తముడను అయియున్నాను.

ఈ ప్రకారముగ స్వానుభవ మెవనికి కలిగియుండునో అతడు నేనే అయియున్నాను. ఇట సంశయము లేదు. దీనిని ఒకసారి అయినను ఎవడు వినునో అతడు స్వయముగా బ్రహ్మమే యగుచున్నాడు.