Tuesday, January 28, 2014

21. అమృతనాదోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

బుద్ధిమంతుడు శాస్త్రములను బాగుగా అధ్యయనము చేసి, అందలి ధర్మములను మరల మరల అభ్యాసము చేసి పరబ్రహ్మమును తెలిసికొని, ఆ పిదప కోరదగినవి కాని వాటినన్నిటిని త్యజించవలెను.
ఓంకారమను రధమునెక్కి, విష్ణుమూర్తిని సారధిగా జేసికొని పరబ్రహ్మ స్థానమును వెదకుచు రుద్రారాధన తత్పరుడవై యుండవలెను.
బ్రహ్మలోక యాత్రాపరుడైన సాధకుడు రాధమార్గ మున్నంతవరకు రాధాములోపోయి, తదుపరి రధమును వీడి బ్రహ్మలోకమున కేగవలెను.
శబ్ద, స్పర్శాది విషయములైదు, అతిచంచలమగు మనస్సు అను పగ్గములను వశమునందుంచుకొని, సంయమశీలుడై యుండుట ప్రత్యాహార మనబడును.
ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామం, ధారణ, సత్యా సత్య విచారణ, సమాధి అను ఆరు అంగములు యోగమని చెప్పబడును.
పర్వత (గైరిక) ధాతువులను కొలిమిలో పెట్టి ఊదుటవలన, వాని యందలి మాలిన్యము తొలగి పోవునట్లు, ఇంద్రియములకు చెందిన దోషములు ప్రాణాయామముచే నశించిపోవు చున్నవి.
ప్రాణాయామముచే మనస్సునందలి దోషములను నశింపజేయవలెను. ధారణీలతో పాపమును నశింపజేయవలెను. ప్రత్యాహారముచే సంసర్గదోషములను నశింపజేయవలెను. ధ్యానముచే అనాత్మీయములైన ప్రాకృతగుణములను నశింప చేయవలెను.
పాపమును నశింపజేసికొని ఉత్తమమైన ఆత్మను గూర్చి చింతన చేయవలెను.
న్యాహృతితో కూడినదియు, ఓంకారసహితమైనదియు నగు గాయత్రిమంత్రమును శిరస్సుతో గూడ ప్రాణసంయమశీలుడైన సాధకుడు మూడుసార్లు పఠించవలెను. అయ్యది ప్రాణాయామమనబడును.
గ్రుడ్డివానివలె రూపములను చూడుము. చెవిటివానివలె శబ్దములను వినుము. దేహమును కొయ్యవలె చూడుము. ఇదియే ప్రశాంతుని యొక్క లక్షణమై యున్నది.
సంకల్పరూపమైన మనస్సును విచారణచే బాగుగా తెలిసికొని బుద్ధిమంతుడు తన యా మనస్సును ఆత్మయందు స్థాపించి, ధ్యానశీలుడై యుండుట ధారణ యనబడును.
వేదములను అనుగుణ్యముగా ఊహించుట తర్కమని చెప్పబడును. దేనిని పొంది సర్వత్ర సమముగా నున్న పరబ్రహ్మమందు నిలుకడగలగి యుండునో అది సమాధియని చెప్పబడును.
ఏకాక్షరమును, బ్రహ్మస్వరూపమును అగు ఓంకారముతో బ్రహ్మధ్యానపూర్వకముగా రేచకము సలుపవలెను. ఈ ప్రకారముగా దివ్యమంత్రముతో అనేక పర్యాయములు రేచకాదులను సలుపుచు, మనస్సునందలి దోషములెల్ల నశించి పోవువరకు ఆ ప్రకారము జపధ్యానాదులను గావించుచుండవలెను.
అడ్డముగాని, నిలువుగాని, క్రిందుగాను ప్రసరించునట్టి దృష్టినివీడి ధ్యానశీలుడు స్థైర్యము కలవాడై, నిశ్చల శరీరుడై సదా యోగమును లెస్సగా అభ్యాసము చేయవలెను.

ధ్యానపరుడైన యోగి భయమును, క్రోధమును, సోమరితనమును ,అతినిద్రను, అతిజాగారనమును, అధికాహారమును ,ఆహారములేమిని, సదా వర్జించవలెను.   

Wednesday, January 15, 2014

20. అమ్రుతబిందూపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

మనస్సు శుద్ధ మనియు, అశుద్ధ మనియు రెండు విధములుగా చెప్పబడినది. కోరికలుకల మనస్సు ఆశుద్దమును, కోరికలులేని మనస్సు శుద్దమును అగును.
మనుజుల యొక్క బంధ, మోక్షములకు కారణము మనస్సే అయి యున్నది. విషయములందు ఆసక్తమైయున్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును.
విషయాసక్తముకాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పబడినందు వలన ముముక్షువు నిత్యము తన మనస్సును విషయ రహితముగా చేయవలెను.
విషయమందలి ఆశక్తిని వదలి హృదయమందు చక్కగా నిరోధింపబడి ఎపుడు మనస్సు సదా ఆత్మ స్వరూపమును పొందునో అపుడది ఉత్తమమైన పదము(స్థానము) కాగలదు.
హృదయమందలి సంకల్పములు క్షయ మగునంతన అగు మనస్సును నిరోధింపవలయును. ఇదియే ధ్యానము. ఇదియే యోగము, తక్కిన న్యాయము (వాక్యము) లన్నియు నిస్సారమే కాగలవు.
ఆ బ్రహ్మము నిష్కలమై, నిర్వికల్పమై, నిరంజనమై యున్నది. ఆ బ్రహ్మము నేను అని తెలిసికొనిన యెడల మనుజుడు సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు.
నిర్వికల్పమై, అనంతమై, కారనవర్జితమై, దృష్టాంతరహితమై అప్రమేయమై, అనాదియైనట్టి ఆ బ్రహ్మమును తెలిసికొని జ్ఞానీ బంధమునుండి విడివడు చున్నాడు.
నిరోధము లేదు, ఉత్పత్తిలేదు, బద్దుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు ఇదియే పరమార్ధ తత్త్వము.
మననము చేయదగిన ఆత్మ జాగ్రత్ ,స్వప్న, సుషుప్తులయందు ఒక్కటే అయియున్నది. ఆ జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడు అవస్థలను దాటినవానికి పునర్జన్మము లేదు.
ప్రాణులకు అత్మయైనది ఒక్కటే. అది సమస్త ప్రానులందును కలదు. ఆ ఆత్మ నీటి యందు చంద్రునివలె ఒకటిగాను ,అనేకము గాను కనుపించుచున్నది.
శబ్దాది ప్రపంచరూపమాయచే ఆవరింపబడి యుండువాడు ఆ మాయమగు అందకారము నుండి ప్రకాశమునకు వచ్చుట లేదు. (ప్రకాశరూప బ్రహ్మమును తెలిసికొనుట లేదు). ఆ అంధకారము తొలగినచో ఏకమైన స్థితిని ఒక్కడుగానే చూచుచున్నాడు.  
ప్రణవశబ్దమునందు నాశరహితమైన శ్రేష్టమైన బ్రహ్మము కలదు. ఆ ప్రణవశబ్దము లయించగా ఏ అక్షర పరబ్రహ్మము శేషించుచున్నాడో, ఆ నాశరహితమగు పరబ్రహ్మమును ఆత్మ శాంతిని కోరు జ్ఞాని సదా ధ్యానించవలెను.
బుద్ధిశాలి వేదశాస్త్రాది గ్రంధములను బాగుగా అభ్యసించి జ్ఞాన, విజ్ఞానములందు తత్పరుడై, ఆ తదుపరి ధ్యానమును కోరువాడు పొత్తును వదలివేయునట్లు ఆ గ్రంధము నన్నిటిని వదిలి వేయవలెను.
ఆవులు పలురంగులు కలవి అయియున్నవి, వాని యొక్క పాలు ఒకేవర్ణము కలిగియుండు చున్నది. ప్రపంచమందలి బహువిధరూపములు ఆవులు. జ్ఞానరూపమగు ఆత్మ పాలలాంటిది.
పాలయందు నేయి నిగూడముగా నుండునట్లు ప్రతిప్రాణి యందును విజ్ఞానరూపమగు ఆత్మ నిగూఢముగా నున్నది. సదా మనస్సును మధించి ఆ అత్మయను నవనీతమును వెలువరించవలెను.     
మనుజుడు జ్ఞాననేత్రము కలవాడై మనస్సును మదించి నిష్కలమై, నిశ్చలమై, శాంతమైనట్టి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మమును అనుభూత మొనర్చుకొనవలెను.
సమస్త ప్రాణులకు ఆధారముగా నున్నవాడనై, సమస్త ప్రాణులందు నివసించుచు, సమస్త ప్రాణులను సంరక్షించుచున్న వాసుదేవుడే నేను, ఆ వాసుదేవుడే నేను.

19. పరమహంసోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

పరమహంసయగువాడు తనచిత్తమును నాయందే (భగవంతుని యందే) స్థాపించును. కాబట్టి నేనును అతనియందు ఉండుచున్నాను.
పరమహంస సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండమును (బ్రహ్మాండ భావమును) కూడ వదలివైచి (ఆత్మపరాయణుడై) యుండును.   
పరమహంస తన దేహమును శవము మాడ్కి (జడముగ) చూచును.
పరమహంస కోరిక లన్నింటిని త్యజించివైచి అద్వైత పరమాత్మయందు మనస్సును స్థాపించియుండును.
జ్ఞానదండమును ఎవడు ధరించునో అతడు ఎకదండి సన్యాసి యనబడును.
ఎవడు కేవలము కాష్టదండమును మాత్రము గ్రహించిన వాడను, ప్రాపంచిక భోగము లన్నింటిని అనుభావించువాడును, ఆధ్యాత్మిక జ్ఞానము లేనివాడును, తితిక్ష (ఓర్పు), జ్ఞానము, వైరాగ్యము, శమదమాదిగుణములు లేనివాడును, భిక్షాచరణ మాత్రముతో కాలమును గడపువాడును అయియుండునో అతడు పాపియు యాత్యాశ్రమవృత్తిని నశింపజేసినవాడును అగును.