Sunday, December 22, 2013

17. గర్భోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

ఋతుకాలమున సంయోగనంతరము ఒక్కరాత్రియుండెనేని (శుక్ల శోణిత పదార్థము) ముద్ద అగుచున్నది. ఏడురోజులు ఉండినచో బుగ్గ అగుచున్నది. పదునైదు దినములకు పిండమగుచున్నది. ఒక నెలకు గట్టియగుచున్నది. రెండు నెలలకు కాళ్ళు కలుగుచున్నవి. నాలుగు నెలలకు కడుపు, నడుము కలుగుచున్నవి. ఐదవ నెల వెన్నెముక కలుగుచున్నది. ఆరవనెల ముక్కు, కన్నులు, చెవులు కలుగుచున్నవి. ఏడవనెల ప్రాణము కలుగుచున్నది. ఎనిమిదవనెల శరీరముయొక్క అవయవములన్నియు సంపూర్ణముగా కలుగును. తోమ్మిదవనెల సంచరించుచున్నది.
గర్భస్తమగు శిశువు పంచభూతస్వరూపుడును, సమర్దుడును అగుచున్నాడు. పంచేంద్రియాలతో గూడి అతడు గంధరసాధులను ఎరుగుచున్నాడు. మంచి జ్ఞానముచేతను, ధ్యానముచేతను ఓంకారమును ఎరుగుచున్నాడు. పరబ్రహ్మ స్వరూపమైన ఆ ఏకాక్షరమును (ప్రణవమును) తెలిసికొనుచున్నాడు. ఈ శరీరమునందు ఎనిమిది ప్రకృతులను, పదునారు వికారములును కలవు. తొమ్మిదవ నెలయందు అన్ని లక్షణములును పూర్తియగుచున్నవి. అత్తరి జీవుడు తన పూర్వపుజాతిని, పూర్వపుకర్మను, చేయబోవు కర్మను, మంచికర్మను, చెడ్డకర్మను తెలిసికొనుచున్నాడు.
(అప్పుడు గర్భస్థజీవుడు ఈ ప్రకారముగా చింతన చేయుచున్నాడు). నేను అనేక స్త్రీ యోనులను చూచినాను. అనేకములైన్ ఆహారములను భుజించితిని. అనేక స్తనములద్వార క్షీరమును పానము చేసితిని.
నాకు సమస్త భూమియు జన్మభూమియే. సమస్తభూమియు శ్మశానమే. నేను ఎనుబదినాలుగు లక్షల యోనిభేదములందు జన్మించితిని.
ఎన్నియోసార్లు పుట్టితిని, ఎన్నియోసార్లు చచ్చితిని. ఎన్నియోసార్లు సంసారినై యుంటిని. పుట్టుట, చచ్చుట, మరల పుట్టుట, చచ్చుట ఈ ప్రకారముగా నా కాలము గడచిపోయినది.
గర్భావాసము మహాదుఃఖకరమైనది జన్మల నెత్తుటయందలి మోహము మహాదుఃఖకరమైనది. బాల్యమునందు దుఃఖము, శోకము, పరవశత్వము, మూఢత్వము కలుగుచున్నవి.
యౌవనమునందు హితకార్యములు చేయక పోవుటయు, సోమరితనము, ఆహితకార్యముల నాచరించుట, విషయాశక్తి, తాపత్రయముచే బాధింపబడుట సంభవించుచున్నవి.
వార్ధక్యమునందు చింతయు, రోగములు కలుగుచున్నవి. మరణమునందు మహాభాయము కలుగుచున్నది. ఆశచేతను, అభిమానముచేతను అధికమైన కామక్రోధాదుల సంకటమునందు తగుల్కొనుటచేతను, అస్వతంత్రతచేతను మిక్కిలి దుఃఖము కలుగుచున్నది.
జన్మము దుఃఖమునకు కారణమైయున్నది. దుఃఖరూపమైనది. మిగుల సహింపరానిదై యున్నది. నేను నివృత్తి ధర్మమును ఏమియు చేయలేదు. యోగాము యొక్కగాని, జ్ఞానము యొక్కగాని సాధన మేమియు చేయలేదు.
ఆహా! దుఃఖసముద్రమున నేను మునిగియున్నాను. దీనికి ప్రతీకార మేమియు ఎరుగక యున్నాను. అజ్ఞానమునకు మరల మరల దిక్కారమగుగాక!
సంసారమను గోలుసునకు దిక్కరమగుగాక! ఈ గర్భము నుండి బయటకు వచ్చిన పిదప సద్గురువును ఆశ్రయించి జ్ఞానమును బొందదెను. ఈ యోని ద్వారమునుండి వెలువడినచో నేను సాంఖ్యయోగమును లెస్సగ ఆశ్రయించెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, మోక్షఫలము నొసంగు వాడను అగు మహేశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, పురుషార్ధములు నొసంగువాడను అగు జగదీశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, సర్వశక్తిమంతుడును, సర్వకారణములకును కారణభూతమైనవాడును, భర్గుడును, పశుపతియు, రుద్రుడును, మహాదేవుడును, జగద్గురువును అయిన పరమేశ్వరుని శరణుబొందేదను .
ఈ యోని బంధమునుండి వెలువడినచో గొప్పతపస్సు నాచరించెదను.
ఈ గర్భావాసమునుండి బయటకు వచ్చినచో అమృతత్వమును (మోక్షమును) కలుగాజేయువాడును, ఆనందరూపుడును, నారాయానుడును అగు విష్ణువును హృదయ మందు ధ్యానించెదను.
నేనిపుడు తల్లిగర్భమందు బంధింపబడి యున్నాను. ఈబంధనములనుండి విడుదలయైనచో భగవంతుడు వాసుదేవుని అనన్యచిత్తముతో భజించి సంతోషపరచెదను.
పూర్వము నేను ఇతరులకొరకై కర్మలనుచేసితిని. ఇపుడు ఒంటరిగానే బాధింపబడుచున్నాను. ఫలమును బొందినవారందరును వెడలిపోయిరి.
పూర్వము నేను నాస్తికుడనై భయమును వదలి అనేక పాపములను చేసితిని. ఇప్పు డా పాపఫలమును అనుభవించుచున్నాను. ఇక మీదట నేను ఆస్తికుడనై యుండెదను.
ఈ ప్రకారముగా అనేకవిధములైన అనర్ధములను గురించి మాటి మాటికి చిన్తనచేసి, జనన మరణరూప సంసారదుఖమును పలుమార్లు సంస్మరించి గర్భామునందలి జీవుడు వైరాగ్యమునుబొంది అజ్ఞానము, కామము, కర్మము మున్నగువానిచే మోహము నొందుచున్నాడు.
ఆ జీవుడు వందలకొలది స్త్రీల యోనిద్వారములను పొందియున్నాడు. ఇపుడు ఆ యోని ద్వారమునుండి విడుదల పొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు శక్తిలేనివాడై యంత్రము నందు తగుల్కొనినట్లు పీడింపబడుచున్నాడు. దుఃఖాతి శయముచే క్లేశము నొందుచున్నాడు. ప్రసవవాయువుచేత పీడింపబడుచున్నాడు. జనన మొందిన వెంటనే అతడు వైష్ణవ వాయువుచే వ్యాపింపబడుచున్నాడు. అత్తరి అతడు పరలోకసాధనను దేనిని స్మరించుటలేదు. అపుడు అపరోక్షజ్ఞానము లేక యుండును.
భూమియొక్క స్పర్శఅయిన వెంటనే జీవుడును క్రూరదృష్టి కల వాడును, పామరుడును అగుచున్నాడు. జలముచే కడుగబడిన తరువాత అతనికి ఆ దృష్టిదోషము తోలగుచున్నది.
జీవుడు పుట్టిన తరువాత అతనికి జననము, మరణము, కర్మము, శుభాశుభ సాధనములు అను ఈ ప్రకారములైన విషయము లెవ్వియును గోచరించుటలేదు. అతనికి వాసనలు అన్నియు నిగూఢములై యుండును.
ఈ శరీరమందు ఎనిమిది కోట్ల రోమములు, ఎనిమిది వందల సంధులు, తొమ్మిదివందల నారములు కలవు. గుండె ఎనిమిదిపలములు, నాలుక పండ్రండు వలములు అన్నియు నశించునవి యని తెలిసికొని గర్భమందలి జీవునివలె సుషుమ్నయందు స్థానముగనుండి వివేకవంతుడై ముని కావలెను. అట్టి జ్ఞాని యిక దేహము నొందుట లేదు.
అట్లుగాక, అజ్ఞానముచే సంసారమును పొందువానికి కీటకమునకువలె నరకముతో సమానమైన ఈ దేహమందు, మూత్రపురీషపానము చేయు దుఃస్థితికలుగును. ఈ తత్వము నేరిగినచో జీవుడు విరక్తిజెందును అని పిప్పలాద మహర్షి చెప్పెను.      

No comments:

Post a Comment