Sunday, February 16, 2014

22. అధర్వశిరోపనిషత్తు :



ఉచ్చరింపగనే శరీరమంతను పైకి లేవదీయును కాబట్టి ఓంకారము అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే ఉచ్చరించు బ్రహ్మనిష్టులకు ఋగ్యజుస్సామాధర్వణవేదములను, షడంగములు మున్నగు వానిని జపయజ్ఞము నందు బ్రహ్మమును పొందింపజేయును. కావున ఓంకారము (ప్రణవము) అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే గర్భ, జన్మ, జరామరణరూప సంసారము యొక్క మహాభాయము నుండి తరింపజేయును, కావున ఓంకారము తారమని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే వృద్దిని పొందుటవలన ఇతరములైన వానిని (జ్ఞానాదులను) వృద్దిని పొందింపజేయుటవలన ఓంకారము పరంబ్రహ్మ అని చెప్పబడుచున్నది.
సమస్త పదార్థములను చూచుచుండుటవలనను, ఆత్మజ్ఞానమును కలుగజేయుటవలనను, యోగమును (జీవబ్రహ్మైక్యమును) పొందింపజేయుటవలనను, పరమాత్మ భగవాన్ అని చెప్పబడుచున్నాడు.
ఓ జనులారా! ఈ ఏకరూపుడై స్వయంప్రకాశుడైన దేవుడు సమస్త దిక్కులను, అహంతర దిక్కులను వ్యాపించియున్నాడు. అతడే సర్వులకు పుర్వుడుగా ఉదయించెను. మరియు బ్రహ్మాండ గర్భములో అతడే పుట్టినవాడు, అతడే పుట్టబోవువాడు. అతడు ప్రత్యగాత్మ స్వరూపుడు, సర్వతోముఖుడు అయి యున్నాడు.
కేశాగ్రభాగ(సూక్ష్మ) పరిమాణము కలిగియున్నవాడును, హృదయమందుండువాడును, విశ్వస్వరూపుడును, స్వయంప్రకాశుడును, వేదమునకు ఉత్పత్తిస్థానమైనవాడును, శ్రేష్టుడును, అంతఃకరణమున ఉన్నవాడును అగు పరమాత్మను ఏ ధీరులు చూచుచున్నారో అట్టివారికి శాశ్వతమగు శాంతి కలుగునుగాని ఇతరులకు కాదు.
ఒక్కడగు ఏ పరమాత్మ ప్రతి శరీరమునందును వెలయుచున్నడో, ఎవనిచే ఈ పంచవిధమైన సకల ప్రపంచము స్థితిని బొందియున్నదో, సర్వనియంతయు పరిపూర్ణుడును, స్వయంప్రకాశుడును, స్తుతింపదగినవాడును అగు అట్టి పరమాత్మను ధ్యానించవలయును. అట్టి ధ్యానముచే సంసారతారకమగు మహత్తర శాంతిని మనుజుడు చక్కగా పొందుచున్నాడు.
అగ్నియే భస్మము, వాయువే భస్మము, జలమే భస్మము, స్థలమే భస్మము, ఆకాశమే భస్మము, ఈ సమస్తము భస్మము, మనస్సు, ఈ నేత్రాది ఇంద్రియములను భస్మమే. అగ్నిరితిభస్మ ఈ మున్నగు ఏడు మంత్రములచేత భస్మమును గ్రహించి, దేహమునకు పూసికొని శిరస్సు మొదలగు అవయవములను తాకవలెను .అందుచేత ఈ వ్రతము పాశుపతము అనబడుచున్నది. ఇది అజ్ఞానులగు జీవులయొక్క అజ్ఞాన, తత్కార్యములయొక్క విమోక్షణము కొఱకు అయియున్నది.