Wednesday, December 11, 2013

12. కైవల్యోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

సాధనచతుస్టయ సంపత్తిని పొందిన తరువాత అశ్వలాయనుడు భగవంతుడైన బ్రహ్మదేవుని యొద్దకు వెళ్లి ఇట్లడిగెను.
మహాత్మా! శ్రేష్టమైనదియు, ఎల్లప్పుడు సజ్జనులచే ఉపాసింప దగినదియు, దేనిచేత జ్ఞాని సమస్త పాపములను పోగొట్టుకొని పరాత్పరుడగు పరమాత్మను పొందునో, అట్టిదియును అగు బ్రహ్మవిద్యను ఉపదేశింపుడు.
అది విని బ్రహ్మదేవుడు అశ్వలాయనకు ఇట్లు బోధించెను. నీవు శ్రద్ధ, భక్తీ, ధ్యానము, యోగము అనువానిద్వారా భగవంతునిని తెలిసికొనుము. కర్మచేతగాని, సంతానముచేతగాని, ధనముచేతగాని మోక్షము కలుగదు. త్యాగమను ఒక్కదాని చేతనే జ్ఞానులు మోక్షమును పొందిరి.
స్వర్గముకంటె శ్రేష్టమైనదియు, హృదయగుహయందు వుండునదియు, ప్రకాశించునదియు అగు ఆ పరబ్రహ్మమును, వేదాంత విజ్ఞానముచే బాగుగా నిశ్చయింపబడియుండు అర్ధమును తెలిసికొనిన వారును, సన్యాసయోగాముచేత శుద్దమైనట్టి అంతఃకరణము కల వారును అగు యతులు పొందుచున్నారు.
ఆ యతులందరును చివరిజన్మయోక్క అంతమందు బ్రహ్మలోకములందు పరమాత్మను పొంది విమక్తులగుచున్నారు (పునర్జన్మ రహితమగు మోక్షమును పొందుచున్నారు).
ఏకాంతప్రదేశమున సుఖాసనస్థుడై, నిర్మలమనస్కుడై, ఇందియములన్నింటిని నిగ్రహించి, హృదయకమలమును రాజోగుణరహితముగను, పరిశుద్దముగను భావించి, ఆ హృదయ కమల మధ్యమున ఉన్న నిర్మలుడును, అగోచరుడను, అనంతరూపుడును, మంగళకరుడును, ప్రశాంతుడును, అమ్రుతస్వరూపుడును, మాయకు కారణభూతుడును, ఆదిమధ్యాంతరహితుడును, అద్వితీయుడును, సర్వవ్యాపియు, చిదానంద స్వరూపుడును, రూపరహితుడును, ఆశ్చర్యకరుడును, ప్రభువును, త్రినేత్రుడును,నీలకంటుడును, శాంతస్వభావుడును అగు పరమేశ్వరుని ధ్యానించి ముని యగువాడు సర్వసాక్షియు, అజ్ఞానమునకు, అన్యమైనదియు, సమస్త ప్రాణులకును, ఆదికారణమైనదియు నగు పరమాత్మను పొందుచున్నాడు.
ఆ పరమాత్మయే బ్రహ్మ దేవుడు, అతడే శివుడు, ఇంద్రుడు, నాశరహితుడు, ఉత్తముడు, స్వయంబప్రభువు, విష్ణువు, ప్రాణము, కాలము, అగ్ని, చంద్రుడు అయి యున్నాడు.
భూత, భావిష్యత్తులయందుండు సమస్తము ఆ పరమాత్మయే. అతడు శాశ్వతుడు. ఆ పరమాత్మను తెలిసికొని జ్ఞానీ మృత్యువును దాటుచున్నాడు. మోక్షమును పొందుటకు ఇంతకంటే వేరగు మార్గము లేదు.
సమస్త ప్రాణులందును తనను, తనయందు సమస్త ప్రాణులను చూచువాడు పరబ్రహ్మను పొందుచున్నాడు. ఇతర కారణములచే పొందుటకు వీలులేదు.
తన మనస్సును క్రింది కట్టేగను, ఓంకారమును పైకట్టేగను చేసికొని జ్ఞానమను మధనము ద్వారా అభ్యాసము ద్వారా జ్ఞాని అజ్ఞానపాశమును దాహించివేయుచున్నాడు.
ఆ పరమాత్మయే (జీవరూపమున) మాయచే మొహింపబడిన అంతఃకరణము కలవాడై, శరీరమును పొంది కార్యములన్నిటిని చేయుచున్నాడు. అతడే జాగ్రుత్తునందు స్త్రీ, అన్నము పానము మొదలైన విచిత్రములగు భోగములచే పరిత్రుప్తిని పొందుచున్నాడు.
ఆ పరమాత్మనుండి ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, సర్వమును ధరించి యుండు భూమి కలుగుచున్నది.
సర్వస్వరూపియు, ప్రపంచమునకు ముఖ్యస్థానమును, సుక్ష్మముకంటే సూక్ష్మమును అగు పరబ్రహ్మమేది కలది అదియే నీవు. నీవే అది.
జాగ్రుత్తు, స్వప్నము, సుషుప్తి మొదలగు వానియందు ఏ ప్రపంచము గోచరించుచున్నదో, అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నేను అని తెలిసికోనువాడు సమస్త బంధములనుండి విముక్తుడగును.
మూడు అవస్థలయందును అనుభవింపబడునది, అనుభవించువాడు, అనుభావమగును అనునవి యేచి కలవో వానికంటె విలక్షనమైనవాడను, సాక్షియు, చిన్మాత్రుడను అగు సదాశివుడను నేను.
నా యందే (అత్మయందే) సమస్తము కలుగుచున్నది. నా యందే సమస్తము లయించుచున్నది. అట్టి అద్వయ బ్రహ్మమునే నేను అయియున్నాను.
నేను అణువుకంటేను సూక్ష్మముగను, మహత్తుకంటేను మహత్తరమై వున్నాను. విచిత్రమైన ఈ ప్రపంచము నేనే. పురాతన స్వరూపుడను నేనే. ఈశ్వరుడను నేనే. నేను జ్యోతిస్వరూపుడను, మంగళరూపుడను అయియున్నాను.
అనేక వేదములచే తెలియబడువాడను నేనే. వేదాంత ప్రవక్తుడను నేనే. వేదవేద్యుడను నేనే. నాకు పుణ్యపాపములు లేవు. నాకు నాశము లేదు. నాకు జన్మము, దేహము, ఇంద్రియములు, బుద్ధి ఇవి ఎవియు లేవు.
నాకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు లేవు. హృదయగుహయందున్నదియు, రూపరహీతమైనదియు, అద్వితీయమైనదియు, సమస్తమునకు సాక్షియు, సత్తు, అసత్తులేనిదియు, పరిశుద్దమైనదియు నగు పరమాత్మ స్వరూపమును తెలిసికొని జీవుడు అట్టి పరమాత్మా స్వరూపమును పొందుచున్నాడు.

కాబట్టి ఈ పరమాత్మను తెలిసికొని జీవుడు సంసార సముద్రమును నశింపజేయునట్టి జ్ఞానమును పొందుచున్నాడు. దానిచే మోక్షమును బడయుచున్నాడు. శాశ్వత సుఖమును పొందుచున్నాడు.

No comments:

Post a Comment