Wednesday, December 11, 2013

14. శ్వేతాశ్వతరోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

పరమాత్మను గూర్చి తెలిసికోనినపుడు సమస్త పాశములనుండి విడినగుచున్నాడు.
పరమాత్మను నెరిగిన యెడల జీవునకు అవిద్యాది పాశములు తొలగిపోయి, క్లేశము క్షయించి జనన మరనాది దుఃఖములు నశించును.                
తనయందున్నట్టి పరమాత్మను ఎల్లప్పుడు తెలిసికోనవలెను. ఎరుంగదగిన వస్తువు దీనికంటె వేరుగ మరేదియును లేదు.         
తన దేహమును క్రిందికట్టేగాను, ఓంకారమును పైకట్టేగను చేసికొని ధ్యానాభ్యాసమను మధనము గావించి నిగూడమైయున్న అత్మదేవుని దర్శించవలయును.
ఆత్మ విద్యకు, తపస్సునకు మూలభూతమైన పరబ్రహ్మమును పాలయందు నేయివలె, సమస్త జగత్తునందును వ్యాపించియున్నట్లు తెలిసికొని జీవుడు బంధరహితుడగుచున్నాడు.
శిరస్సు, కంటము, శరీరము అను ఈ మూడింటిని తిన్నగా నిలిపి, ఇంద్రియములను, మనస్సును హృదయమందు స్థాపించి, బ్రహ్మ మనెడు తెప్పచేత భయావహములైన జననమరనాది సంసారమను ప్రవాహమును జీవుడు దాటవలెను.
చెడ్డ గుర్రములు కల రధమును సారధి బహుజాగరూకుడై నడపించునట్లు, సాధకుడు అప్రమత్తుడై మనస్సును జయించవలయును.                    
యోగాగ్నిమయమైన శరీరము కలవానికి రోగము కాని, వార్ధకము కాని, మరణము కాని ఉండవు.         
యోగాభ్యాసమునందు ప్రవర్తించిన వానికి శరీరము తేలికగా నుండును. ఆరోగ్యవంతముగా నుండును. ఆశలు లేకుండును. శరీరము ప్రకాశమానమై యుండును. కంటధ్వని స్పస్టముగా నుండును.
సాధకుడు అత్మతత్త్వమును దర్శించి అద్వితీయుడును, ధన్యుడును, దుఃఖరహితుడను అగుచున్నాడు.
జన్మరహితమై, నిశ్చలమై, విశుద్దమైనట్టి అత్మదేవుని తెలిసికొని జీవుడు సమస్త పాశములనుండియు విదివడుచున్నాడు.      
ఆ పరమపురుషుని (పరమాత్మను) మహాత్ముడుగను, ప్రకాశస్వరూపుడుగను, తమస్సునకు ఆవలనున్నవాడుగను నేను ఎరుగుచున్నాను. అతని నెరిగి జీవుడు మృత్యువును దాటుచున్నాడు. మోక్షమునకు ఇంతకంటె వేరుమార్గము లేదు.
దీనికంటే శ్రేష్టమైనదికాని, వేరైనదికాని, పెద్దదికాని, చిన్నదికాని ఏదియులేదో, ఏది వ్రుక్షమువలె ఆకశామునందు నిలబడియున్నదో, అట్టి బ్రహ్మముచేత ఈ సమస్త ప్రపంచము పరిపూర్ణమై వ్యాప్తమై యున్నది.
ఈ జగత్తుయోక్క కార్యకారనములకంటే వేరైనదియు, రూపరహితమైనదియు, తాపత్రయవర్జితమైనదియునగు బ్రహ్మమును ఎరింగినవారు మరణరహితులగుచున్నారు. తదితరులు దుఃఖమును పొందుచున్నారు.
ఆ భగవంతుడు సమస్త ప్రాణులయొక్క ముఖములును, శిరస్సులును, కంటములును గలవాడై యున్నాడు. సర్వ జీవుల యొక్క హృదయగుహలందు నివసించుచున్నాడు. అతడు సర్వవ్యాపి, మంగళస్వరూపుడు అయియున్నాడు.
పరమాత్మా అంగుష్టమాత్ర పరిమానముతో హృదయగుహయందు వెలయుచున్నాడు. అతడు పరిపూర్ణుడు, సమస్త ప్రాణుల హృదయములందుండి మనస్సుచే కప్పబడి యున్నాడు. అతడు జ్ఞానమునకు ప్రభువు. ఈ ప్రకార మెరుంగువాడు మరణము లేనివారగుచున్నారు.
ఆ దేవుడు నవద్వారములుకల శరీరమను పట్టణమందు ఆత్మరుపమున వెలయుచు, స్థావరజంగమాత్మకమైన సకల ప్రపంచమును స్వాధీనము చేసుకొని బయటకూడ సంచరించుచున్నాడు.
ప్రకృతి మాయయనియు, ఆ మాయకు అధిపతి ఈశ్వరుడనియు తెలియదగినది. ఆ ఈశ్వరుని యొక్క అవయవరూపములగు పదార్థములచే ఈ జగత్తు వ్యాప్తమై యున్నది.
ఆ ఈశ్వరుడు ప్రక్రుతియగు మాయయందు వశించియున్నాడు. అతడు అద్వితీయుడు; ఈ ప్రపంచమంతయు అతనియందే లయమగుచున్నది. అతడే ముక్తి నొసంగువాడు, స్తుతింపబడువాడు, దేవుడు. అట్టి ఈశ్వరుని బాగుగా విచారించి తెలిసి కొనువాడు పరమ శాంతిని (మోక్షమును) పొందుచున్నాడు.
ఈ ప్రపంచమునందు సుక్ష్మాతిసూక్ష్మమై వెలయువాడును, జగత్తుయొక్క సృష్టికర్తయు, అనేక రూపములు కలవాడును, అద్వితీయుడును, ప్రపంచమంతయు వ్యాపించియున్నవాడును, మంగళస్వరూపుడును అగు పరమేశ్వరుని తెలిసికొని మనుజుడు పరమశాంతిని పొందుచున్నాడు.
ఆ పరమాత్మయే కాలస్వరూపుడును, లోకమును సంరక్షించువాడు, జగత్పరిపాలకుడును, సమస్త ప్రానులందును నిగూఢముగా నున్నవాడును, ఋషులు, దేవతలు ధ్యానించునట్టి దేవదేవుడును అయియున్నాడు. అతని నెరిగి జనులు మృత్యు పాశమును చేధించివేయుచున్నారు.
ఘ్రుతముకంటెను అతి సూక్ష్మమైనవాడును, సమస్తప్రాణులందును నిగుడముగా నున్నవాడును, అద్వయరూపుడును, ప్రపంచమంతయు వ్యాపించియున్నవాడును అగు ఆత్మదేవుని ఎరిగి మనుజుడు సమస్త పాశములనుండియు విడివడుచున్నాడు.

ఎవనికి భగవంతునియందు విశేషభక్తికలదో, అట్లే గురువు నందును కలదో, అట్టి మహాత్మునకు ఉపదేశింపబడిన ఈ బోధలన్నియు చక్కగా ప్రకాశించును. (అనుభవమునకు వచ్చును).

No comments:

Post a Comment