Monday, March 31, 2014

34.నిరాలంబోపనిషత్తు:

గురుస్వరూపుడును, సచ్చిదానంద మూర్తియును, ప్రపంచ రహితుడును ,శాంతుడును, ఆధారరహితుడును, జేజోరూపుడును అగు శివునకు (మంగళస్వరూపమగు పరమాత్మకు) నమస్కారము.
నిర్గుణబ్రహ్మమును ఆశ్రయించి సగుణకారమును ఎవడు త్యజించునో అతడే సన్యాసి, అతడే యోగి. అట్టివాడు మోక్ష పదము నొందును.                   
అద్వితీయమైనదియు, సకలోపాధివినిర్ముక్తమైనదియు, సర్వశక్తిసంపన్నమైనదియు, ఆదిఅంతములు లేనిదియు, శుద్దమైనదియు, మంగళకరమైనదియు, శాంతమైనదియు, నిర్గుణమైనదియు, అనిర్వచనీయమైనదియు నగు చైతన్యమే బ్రహ్మము.
ఈ సమస్తము బ్రహ్మమే. ఇచట అనేకత్వమొకింతైనను లేదు.       
శరీర, ఇంద్రియ సంశయముచేతను సద్గురూపాసనచేతను ,శ్రవణమనన నిధిధ్యాసములచేతను, ద్రుగ్ద్రశ్యస్వరూపమైనదంతయును సర్వాంతర్యామియై యున్నది. సర్వ సమానమైనది. ఘటపటాది వికారవస్తువులందు వికారరహితమైనది యగు చైతన్యము తప్ప వేరొకటి ఏదియు నిచట లేదను సాక్షాత్కారానుభావమే జ్ఞానము.
త్రాటియందు సర్పభ్రాంతివలె కేవలము సర్వాంతర్యామి సర్వస్వరూపపమునగు బ్రహ్మమునందు దేవతలు, పశువులు, మనుష్యులు, స్త్రీలు, పురుషులు, వర్ణాశ్రమములు, బంధమోక్షములు అను అనేక భేదములచే కల్పితమైన జ్ఞానమే అజ్ఞానము.
అనాత్మరూపములైన విషయములయొక్క సంకల్పమే దుఃఖము.
సజ్జనుల సాంగత్యమే స్వర్గము.
అసత్తైన సంసారముయొక్క విషయములందు ప్రవ్రుత్తులైన అజ్ఞానులతోడి సాంగత్యమే నరకము.
అనాదియగు అజ్ఞానము యొక్క వాసనచే నేను జన్మించినవాడను అను ఈ ప్రకారములైన సంకల్పములు కలిగియుండుటయే బంధము. తల్లిదండ్రులు, సోదరులు, భార్య, బిడ్డలు, గృహము, ఉద్యానము, పొలము మొదలైన వానియందు మమత్వము కలిగి యుండి సంసారముయొక్క ఆవరణమును గూర్చి సంకల్పము కలిగి యుండుటయే బంధము.
కర్త్రుత్వాదులు, అహంకారము వీనిని గుర్చిన సంకల్పమే బంధము. కేవలం సంకల్ప మాత్రమె బంధము.
నిత్యానిత్య వస్తువిచారణచే అనిత్యములైన సంసార సుఖదుఃఖ విషయములగు సమస్త వస్తువులందును మమకారము నశించుటయే మోక్షము.
సర్వజీవుల శరీరములందున్న చైతన్య బ్రహ్మమును పొందించు గురువు ఉపాసింపదగినవాడు.    
సర్వుల అంతరంగమున ఉన్న చిద్రూపమును (ఆత్మను) ఎరిగినవాడే విద్వాంసుడు.
కర్త్రుత్వాది అహంకారభావము గూఢిపడినవాడు మూఢుడు.         
బ్రహ్మము సత్యము ,జగత్తు మిధ్య అను అపరోక్షజ్ఞాన రూపముగు అగ్నిచే బ్రహ్మాద్వైశ్వర్యవాంఛయొక్క సంకల్పమును సముహముగా దగ్ధ మొనర్చుటయే తపస్సు.
ప్రాణము, ఇంద్రియములు మొదలైనవానికంటెను; అంతఃకరణముకంటెను, త్రిగుణములకంటెను, పరమైనదియు, సచ్చిదానంద స్వరూపమైనదియు, సర్వమునకు సాక్షియైనదియు; నిత్యముక్తమైనదియునగు బ్రహ్మముయొక్క స్థానము పరమపదము.
దేశ కాలవస్తు పరిచ్చేదరహిత చిన్మాత్రస్వరూపమే గ్రహింపదగినది.         
స్వస్వరూప వ్యతిరిక్తమైనదియు, మాయామయములగు బుద్ధీంద్రియములకు గోచరమైనదియు నగు జగత్తు సత్యమను చింతనము గ్రహింపదగినది కాదు.

ప్రాపంచికవిషయములనెల్ల పరిత్యజించి నిర్మముండు, నిరహంకారుండునై, తన కిష్టమగు బ్రహ్మమును శరణుజొచ్చి, తత్త్వమసి, అహంబ్రహ్మస్వి, సర్వంఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తేకించన మొదలైన మహావాక్యముల యొక్క అర్ధమును అనుభవమునకు తెచ్చుకొనుటవలన నేను బ్రహ్మమునే యగుదును అని నిశ్చయముగా నెరింగి నిర్వికల్ప సమాధితోగూడి స్వతంత్రుడై యతి సంచరించుచుండును. అతడే సన్యాసి. అతడే ముక్తుడు. అతడే పూజ్యుడు, అతడే యోగి, అతడే పరమహంస. అతడే అవధూత, అతడే బ్రాహ్మణుడు.

No comments:

Post a Comment