Monday, March 31, 2014

2౩. అధర్వశిఖోపనిషత్తు ; 24. మైత్రాయణ్యుపనిషత్తు :

2౩. అధర్వశిఖోపనిషత్తు :
ఇతరమైన సమస్తమును పరిత్యజించి శినంకముడైన (మోక్షము నొసంగువాడైన) శివునే (శుభ్రప్రదుడైన పరమాత్మను) ఒక్కనినే ధ్యానించవలెను.
24. మైత్రాయణ్యుపనిషత్తు :
(బృహద్రధుడను రాజు శాకాయన్యుడను ఋషి నిట్లు అడిగెను).
మహాత్మా! ఎముకలు ,చర్మము, నరములు, మజ్జ, మాంసము ,శుక్లము, శోణితము, శ్లేషము ,కన్నీరు – వీనిచే దూషితమైనదియు ,మలమూత్రములచే వాతపిత్తకఫలములచే దుర్లంధమైనదియు ,సారహీనమైనదియు నగు ఈ శరీరమునందు కామభోగములచే జనులకు కలుగులాభమేమి?
మహాశయా! కామము, క్రోధము, లోభము, మోహము, భయము, విషాదము ,ఈర్ష్య, ఇష్టజనవిరహము, అనిష్టప్రాప్తి ,ఆకలి, దప్పిక, ముసలితనము,మరణము ,రోగము, శోకము మొదలైన వానిచే అభిహతమైన ఈ శరీరమునందు కామభోగాములచే కలుగు లాభమేమి?
ఈ ద్రుశ్యజగత్తు అంతయు నాశవంతముగా కనబడుచున్నది. ఈ ఈగలు ,దోమలు మొదలైన కీటకములు పచ్చగడ్డివలె పుట్టుచు, గిట్టుచు, నశ్వరములై యున్నవి.
గొప్ప ధనుర్దారులైన చక్రవర్తులు కొందరు కలరు. వారు అంతా బహుసంఖ్యాకములైన ధనసంపదలను వారు త్యజించివేసి ఇహలోకమునుండి పరలోకమునకు పోయిరి. 
మహాసముద్రములు ఎండిపోవుచున్నవి, పర్వతములు కూలిపోవుచున్నవి, ధ్రువనక్షత్రములు సంచలించుచున్నది, చెట్లు నిలుచుటలేదు. భూవలయము మునిగిపోవుచున్నది. దేవతలు స్థాన భ్రస్టులగుచున్నారు. ఇట్టి సంసారమునందు కామభోగములచే కలుగు లాభమేమి? కమభోగాశ్రయుడైన జీవుడి లోకమున అనేక జన్మలను బొందుచుండుట కానబడుచున్నది. పూజనీయ! సెలవిండు, మీరే మాకు దిక్కు!
రాజా! పరిశుద్దమైన జీవుడు ఈ శరీరమునుండి నిష్క్రమించి పరంజ్యోతిలో ఐక్యమవును. ఇదియే ఆత్మ. ఇది అద్భుతమైనది. అభయమైనది. ఇదియే బ్రహ్మము.
పరమగు ఈ ఆత్మ పరిశుద్దమైనది ,స్థిరమైనది, నిశ్చలమైనది, అసంగమైనది, అవ్యగ్రమైనది, నిస్ప్రుహమైనది. నాటకమునుగాంచు ప్రేక్షకుని భంగి యుండునది. గుణమయమైన వస్త్రముచే తన స్వరూపమును అచ్ఛాదించుకొనియుండునది అయియున్నది.
శబ్దము, స్పర్శము మొదలైన విషయములు మనుష్యులకు అనర్ధములవలె నున్నవి. అనర్ధకములైన అట్టి విషయములందు ఆసక్తుడైన జీవుడు పరంధామమైన మోక్షమునుగూర్చి తలంచుటలేదు.
తపస్సుచే సత్వగుణము కలుగును. సత్వగుణముచే పరిశుద్దమైన మనస్సు ఏర్పడును. అట్టి పరిశుద్ద మనస్సుద్వార ఆత్మ లభించుచున్నది. ఆత్మ లాభముచే జీవునకు పునరావృత్తిరహిత కైవల్యము సంప్రాప్తించుచున్నది.
కట్టెలు లేని అగ్ని తనయందే తానూ ఉపశమించునట్లు, వృత్తులు (సంకల్పములు) నశించుటచే మనస్సు తనయందే తాను ఉపశమించుచున్నది.
చిత్తమే సంసారము. చిత్తమును ప్రయత్నపూర్వకముగా శుద్ధ మొనర్పవలయును. చిత్తము ననుసరించి స్వభావము, చేష్టలు, అభ్యాసములు కలుగుచుండును. ఇది పురాతనమైన రహస్యము.
చిత్తముయొక్క నిర్మలత్వముచే జీవుడు కర్మలను నశింపజేయుచున్నాడు. పరిశుద్ద మనస్సుకలవాడు ఆత్మయందు స్థితుడై అక్షయసుఖ మనుభవించుచున్నాడు.
మనస్సు శుద్దమని, అశుద్దమని రెండు విధములుగా చెప్పబడింది. కామసంకల్పములతో కూడినది అశుద్దమనియు, కామవర్జితమైనది శుద్ధ మనియు ఎరుంగవలయును.
మనస్సును లయ, విక్షేపరహితముగాను, మహానిశ్చలముగను గావించి ధ్యానశీలుడు అమనస్కభావమును ఎపుడు పొందునో, అపుడు పరమాత్మపదమును బడయును.
సాధకుడు తన హృదయమందలి సంకల్పములు నిశ్సేషముగా నశించిపోవువరకు మనస్సును నిగ్రహించవలయును. సంపూర్ణ మనోనిగ్రహమే జ్ఞానము. అదియే మోక్షము. ఇక తక్కిన బోధలన్నియు గ్రంధవిస్తారమే యగును.
నిశ్చల సమాధినిష్టచే మనోమాలిన్యము తొలగిపోగా, అట్టి నిర్మల మనస్సు ఆత్మయందు ఉంచబడినపుడు కలుగు సుఖమును వాక్కుతో వర్ణించుటకు శక్యము కాదు. ఆ సుఖము స్వయముగా తన అంతఃకరణము ద్వారానే అనుభవింపబడగలదు.
ఈ అక్షరపరబ్రహ్మము మహా పవిత్రమైనది. దీని నెరిగిన వాడు ఏది కోరునో అది వానికి లభించును.

తీవ్ర వైరాగ్యశాలియగు సాధకుడు సర్వజీవులకును అభయమొసంగి, ఎకాంతమునకు పోయి శబ్దాది విషయములను తననుండి బహిష్కరించి పరిశుద్దాత్ముడై, తన శరీరమునుండియే (అంతరంగ మందు) పరమాత్మను పొందును.

No comments:

Post a Comment