Monday, March 31, 2014

28. కాలాగ్నిరుద్రోపనిషత్తు :

సనత్కుమారుడు త్రిపుండ్రధారణ యొక్క వివరమును గూర్చి భగవంతుడు కాలాగ్నిరుద్రుని యడుగగా వారిట్లు చెప్పిరి త్రిపుండ్రధారణ లలాటముపై భ్రూమధ్యము గుండా మూడు రేఖలతో గావింపబడును. అందు మొదటి రేఖ గార్హపత్యాగ్నిని, ఆకారమును, రజోగుణమును, భూర్లోకమును, స్వాత్మను, క్రియాశక్తిని, ఋగ్వేదమును,ప్రాతర్యజ్ఞమును, మహేశ్వరదేవతను సూచించును. రెండవ రేఖ దక్షిణాగ్నిని, ఉకారమును, సత్వగుణమును, అంతరిక్షమును, అంతరాత్మను, ఇచ్చాశక్తిని, యజుర్వేదమును, మాధ్యందినయజ్ఞమును, సదాశివదేవతను సూచించును. మూడవ రేఖ ఆహవనీయాగ్నిని, మకారమును, తమోగుణమును, ధ్యోర్లోకమును, పరమాత్మను, జ్ఞాపకశక్తిని, సామవేదమును, తృతీయయజ్ఞమును, మహాదేవదేవతను సూచించును. ఈ ప్రకారముగా త్రిపుండ్రవిధిని భస్మముతో చేయువాడు విద్వాంసుడైనను, బ్రహ్మచారియైనను, గృహస్థుడైనను, వానప్రస్థుడైనను, సన్యాసియైనను, మహాపాపములనుండి విముక్తుడై పవిత్రుడగును. సమస్త తీర్థములయందు స్నానము చేసిన వాడగును. వేదములన్నిటిని అధ్యయనము చేసినవాడగును. దేవతలందరినీ యెరిగిన వాడగును (పూజించినవాడగును). సదా సమస్త రుద్రమంత్రములను జపించినవాడగును. సమస్త భోగములను అనుభవించినవాడగును. దేహమును వదలిన పిదప అతడు శివసాయుజ్యమును పొందును. అతడు తిరిగి ఈ సంసారమునందు జన్మింపడు.

No comments:

Post a Comment