Monday, March 31, 2014

3౩. సర్వసారోపనిషత్తు :

జీవుడు అనాత్మరూపములగు దేహాలను ఆత్మగా తలంచుచు అభిమానించుచున్నాడు. ఆ దేహాభిమానమే ఆత్మకుబంధము. అది తోలగుటయే మోక్షము. అట్టి అభిమానమును కలుగజేయు నది అవిద్య. అట్టి అభిమానము తొలగిపోవునో అదియే విద్య.
నేను ప్రాణరహితుడను, మనోరహితుడను, పరిశుద్దుడను. బుద్ధి మొదలైనవానికి సదా సాక్షి భూతుడను. నేను సదా నిత్యుడను, చిన్మాత్రుడను. ఇట స,సంశయ మేమియును లేదు.
నేను స్థానువును (నిశ్చలుండను), నిత్యుడను, సదా ఆనంద స్వరూపుడను ,శుద్దుడను, జ్ఞానస్వరూపుడను, నిర్మలుడను. నేను సమస్త ప్రాణులయొక్క ఆత్మను, సర్వవ్యాపకుడను ,సాక్షిని. ఇందు సంశయము లేదు.
సర్వ వేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేను కాను .నేను నామములను కాను. కర్మలు కాను. సచ్చిదానందమైన బ్రహ్మమును నేను.

నేను దేహమును కాను. కావున జననమరణములు ఇక నా కెచట? నేను ప్రాణమును కాను. కావున ఆకలిదప్పికలు ఇంకా నీ కెచట ? నేను చిత్తమును కాను. కావున శోకమోహములు ఇక నా కెచట? నేను కర్తను కాను. కావున బంధమోక్షములు ఇక నా కెచట?

No comments:

Post a Comment