Thursday, April 3, 2014

35. శుకరహాస్యోపనిషత్తు:

జీవుడు దేనిని చూచుచున్నాడో, వినుచున్నాడో, వాసన చూచుచున్నాడో, మాట్లాడుచున్నాడో, రుచిచూచుచున్నాడో అదియే ప్రజ్ఞానమని చెప్పబడినది.
బ్రహ్మదేవునియందును, ఇంద్రాదిదేవతలందును, మనుషులందును; గుఱ్ఱము, ఆవు మొదలైన వానియందును ఏకమైన చైతన్యమే బ్రహ్మము. అందుచే నాయందలి చైతన్యము కూడ బ్రహ్మయగును.
పరిపూర్ణమైన పరమాత్మాజ్ఞానమును లొందుటకు యోగమైన ఈ మనుష్యశరీరమునందు, బుద్దికి సాక్షిగా, నిర్వికారమున ప్రకాశించుచున్నదై పరమాత్మ అహమ్ (నేను) అను పదము చెప్పబడుచున్నది.
స్వయముగా పరిపూర్ణమైన పరమాత్మ మహావాక్యమునందు బ్రహ్మమను పదముచే చెప్పబడినది. అస్మి అను పదము జీవ బ్రహ్మైక్యమును తెలుపుచున్నది. అందుచే నేను బ్రహ్మమునే అగుదును.
సృష్టికి పూర్వము నామరూపములు లేనిది, ఏకమైనది అద్వితీయమైనది అగు ఏ సద్వస్తువు కలదో, ఆ సద్వస్తువునకు ఇప్పుడును విచారణచే తత్వముద్వార ఆ స్వభావమే చెప్పబడుచున్నది.
జీవుని యొక్క శరీర, ఇంద్రియాదులకంటె అతీతమైన సద్వస్తువు మహావాక్యమునందు త్వం పదముచే చెప్పబడినది. అసి అను పదముచే ఐక్యము గ్రహింపబడుచున్నది. అట్టి తత్, త్వం పదార్థముల యనుభవమును ముముక్షువు లనుభవింతురు గాక!
అయమ్ అను పదముచే ఆత్మ స్వయం ప్రకాశమైన ప్రత్యక్షమైనది అను అర్థము చెప్పబడినది. అది అహంకారః ఆదిగా గలిగి స్థూల శరీరము నంతముగా గల జగత్తునకంటె విలక్షణమైన ప్రత్యగాత్మయని చెప్పబడుచున్నది.
దృశ్యజగత్తునకెల్ల అధిష్టానమైన వరతత్త్వము బ్రహ్మ శబ్దముచే చెప్పబడుచున్నది. ఆ బ్రహ్మము స్వయంప్రకాశముమైన ప్రత్యగాత్మరూపమే యగును.
జీవుడు కార్యోపాది, ఈశ్వరుడు కారణొపాది కార్యకారణములను విడనాడినచో పూర్ణబోధయే(ఆత్మయే) శేషించును.

ఇతరవిద్యలయొక్క పరిజ్ఞానము అనశ్యము నశ్వరమైన బ్రహ్మవిద్య యొక్క పరిజ్ఞానము బ్రహ్మమును సంప్రాప్తి చేయును.

No comments:

Post a Comment