Tuesday, January 28, 2014

21. అమృతనాదోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

బుద్ధిమంతుడు శాస్త్రములను బాగుగా అధ్యయనము చేసి, అందలి ధర్మములను మరల మరల అభ్యాసము చేసి పరబ్రహ్మమును తెలిసికొని, ఆ పిదప కోరదగినవి కాని వాటినన్నిటిని త్యజించవలెను.
ఓంకారమను రధమునెక్కి, విష్ణుమూర్తిని సారధిగా జేసికొని పరబ్రహ్మ స్థానమును వెదకుచు రుద్రారాధన తత్పరుడవై యుండవలెను.
బ్రహ్మలోక యాత్రాపరుడైన సాధకుడు రాధమార్గ మున్నంతవరకు రాధాములోపోయి, తదుపరి రధమును వీడి బ్రహ్మలోకమున కేగవలెను.
శబ్ద, స్పర్శాది విషయములైదు, అతిచంచలమగు మనస్సు అను పగ్గములను వశమునందుంచుకొని, సంయమశీలుడై యుండుట ప్రత్యాహార మనబడును.
ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామం, ధారణ, సత్యా సత్య విచారణ, సమాధి అను ఆరు అంగములు యోగమని చెప్పబడును.
పర్వత (గైరిక) ధాతువులను కొలిమిలో పెట్టి ఊదుటవలన, వాని యందలి మాలిన్యము తొలగి పోవునట్లు, ఇంద్రియములకు చెందిన దోషములు ప్రాణాయామముచే నశించిపోవు చున్నవి.
ప్రాణాయామముచే మనస్సునందలి దోషములను నశింపజేయవలెను. ధారణీలతో పాపమును నశింపజేయవలెను. ప్రత్యాహారముచే సంసర్గదోషములను నశింపజేయవలెను. ధ్యానముచే అనాత్మీయములైన ప్రాకృతగుణములను నశింప చేయవలెను.
పాపమును నశింపజేసికొని ఉత్తమమైన ఆత్మను గూర్చి చింతన చేయవలెను.
న్యాహృతితో కూడినదియు, ఓంకారసహితమైనదియు నగు గాయత్రిమంత్రమును శిరస్సుతో గూడ ప్రాణసంయమశీలుడైన సాధకుడు మూడుసార్లు పఠించవలెను. అయ్యది ప్రాణాయామమనబడును.
గ్రుడ్డివానివలె రూపములను చూడుము. చెవిటివానివలె శబ్దములను వినుము. దేహమును కొయ్యవలె చూడుము. ఇదియే ప్రశాంతుని యొక్క లక్షణమై యున్నది.
సంకల్పరూపమైన మనస్సును విచారణచే బాగుగా తెలిసికొని బుద్ధిమంతుడు తన యా మనస్సును ఆత్మయందు స్థాపించి, ధ్యానశీలుడై యుండుట ధారణ యనబడును.
వేదములను అనుగుణ్యముగా ఊహించుట తర్కమని చెప్పబడును. దేనిని పొంది సర్వత్ర సమముగా నున్న పరబ్రహ్మమందు నిలుకడగలగి యుండునో అది సమాధియని చెప్పబడును.
ఏకాక్షరమును, బ్రహ్మస్వరూపమును అగు ఓంకారముతో బ్రహ్మధ్యానపూర్వకముగా రేచకము సలుపవలెను. ఈ ప్రకారముగా దివ్యమంత్రముతో అనేక పర్యాయములు రేచకాదులను సలుపుచు, మనస్సునందలి దోషములెల్ల నశించి పోవువరకు ఆ ప్రకారము జపధ్యానాదులను గావించుచుండవలెను.
అడ్డముగాని, నిలువుగాని, క్రిందుగాను ప్రసరించునట్టి దృష్టినివీడి ధ్యానశీలుడు స్థైర్యము కలవాడై, నిశ్చల శరీరుడై సదా యోగమును లెస్సగా అభ్యాసము చేయవలెను.

ధ్యానపరుడైన యోగి భయమును, క్రోధమును, సోమరితనమును ,అతినిద్రను, అతిజాగారనమును, అధికాహారమును ,ఆహారములేమిని, సదా వర్జించవలెను.   

No comments:

Post a Comment