Wednesday, January 15, 2014

20. అమ్రుతబిందూపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

మనస్సు శుద్ధ మనియు, అశుద్ధ మనియు రెండు విధములుగా చెప్పబడినది. కోరికలుకల మనస్సు ఆశుద్దమును, కోరికలులేని మనస్సు శుద్దమును అగును.
మనుజుల యొక్క బంధ, మోక్షములకు కారణము మనస్సే అయి యున్నది. విషయములందు ఆసక్తమైయున్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును.
విషయాసక్తముకాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పబడినందు వలన ముముక్షువు నిత్యము తన మనస్సును విషయ రహితముగా చేయవలెను.
విషయమందలి ఆశక్తిని వదలి హృదయమందు చక్కగా నిరోధింపబడి ఎపుడు మనస్సు సదా ఆత్మ స్వరూపమును పొందునో అపుడది ఉత్తమమైన పదము(స్థానము) కాగలదు.
హృదయమందలి సంకల్పములు క్షయ మగునంతన అగు మనస్సును నిరోధింపవలయును. ఇదియే ధ్యానము. ఇదియే యోగము, తక్కిన న్యాయము (వాక్యము) లన్నియు నిస్సారమే కాగలవు.
ఆ బ్రహ్మము నిష్కలమై, నిర్వికల్పమై, నిరంజనమై యున్నది. ఆ బ్రహ్మము నేను అని తెలిసికొనిన యెడల మనుజుడు సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు.
నిర్వికల్పమై, అనంతమై, కారనవర్జితమై, దృష్టాంతరహితమై అప్రమేయమై, అనాదియైనట్టి ఆ బ్రహ్మమును తెలిసికొని జ్ఞానీ బంధమునుండి విడివడు చున్నాడు.
నిరోధము లేదు, ఉత్పత్తిలేదు, బద్దుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు ఇదియే పరమార్ధ తత్త్వము.
మననము చేయదగిన ఆత్మ జాగ్రత్ ,స్వప్న, సుషుప్తులయందు ఒక్కటే అయియున్నది. ఆ జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడు అవస్థలను దాటినవానికి పునర్జన్మము లేదు.
ప్రాణులకు అత్మయైనది ఒక్కటే. అది సమస్త ప్రానులందును కలదు. ఆ ఆత్మ నీటి యందు చంద్రునివలె ఒకటిగాను ,అనేకము గాను కనుపించుచున్నది.
శబ్దాది ప్రపంచరూపమాయచే ఆవరింపబడి యుండువాడు ఆ మాయమగు అందకారము నుండి ప్రకాశమునకు వచ్చుట లేదు. (ప్రకాశరూప బ్రహ్మమును తెలిసికొనుట లేదు). ఆ అంధకారము తొలగినచో ఏకమైన స్థితిని ఒక్కడుగానే చూచుచున్నాడు.  
ప్రణవశబ్దమునందు నాశరహితమైన శ్రేష్టమైన బ్రహ్మము కలదు. ఆ ప్రణవశబ్దము లయించగా ఏ అక్షర పరబ్రహ్మము శేషించుచున్నాడో, ఆ నాశరహితమగు పరబ్రహ్మమును ఆత్మ శాంతిని కోరు జ్ఞాని సదా ధ్యానించవలెను.
బుద్ధిశాలి వేదశాస్త్రాది గ్రంధములను బాగుగా అభ్యసించి జ్ఞాన, విజ్ఞానములందు తత్పరుడై, ఆ తదుపరి ధ్యానమును కోరువాడు పొత్తును వదలివేయునట్లు ఆ గ్రంధము నన్నిటిని వదిలి వేయవలెను.
ఆవులు పలురంగులు కలవి అయియున్నవి, వాని యొక్క పాలు ఒకేవర్ణము కలిగియుండు చున్నది. ప్రపంచమందలి బహువిధరూపములు ఆవులు. జ్ఞానరూపమగు ఆత్మ పాలలాంటిది.
పాలయందు నేయి నిగూడముగా నుండునట్లు ప్రతిప్రాణి యందును విజ్ఞానరూపమగు ఆత్మ నిగూఢముగా నున్నది. సదా మనస్సును మధించి ఆ అత్మయను నవనీతమును వెలువరించవలెను.     
మనుజుడు జ్ఞాననేత్రము కలవాడై మనస్సును మదించి నిష్కలమై, నిశ్చలమై, శాంతమైనట్టి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మమును అనుభూత మొనర్చుకొనవలెను.
సమస్త ప్రాణులకు ఆధారముగా నున్నవాడనై, సమస్త ప్రాణులందు నివసించుచు, సమస్త ప్రాణులను సంరక్షించుచున్న వాసుదేవుడే నేను, ఆ వాసుదేవుడే నేను.

No comments:

Post a Comment