Sunday, February 16, 2014

22. అధర్వశిరోపనిషత్తు :



ఉచ్చరింపగనే శరీరమంతను పైకి లేవదీయును కాబట్టి ఓంకారము అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే ఉచ్చరించు బ్రహ్మనిష్టులకు ఋగ్యజుస్సామాధర్వణవేదములను, షడంగములు మున్నగు వానిని జపయజ్ఞము నందు బ్రహ్మమును పొందింపజేయును. కావున ఓంకారము (ప్రణవము) అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే గర్భ, జన్మ, జరామరణరూప సంసారము యొక్క మహాభాయము నుండి తరింపజేయును, కావున ఓంకారము తారమని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే వృద్దిని పొందుటవలన ఇతరములైన వానిని (జ్ఞానాదులను) వృద్దిని పొందింపజేయుటవలన ఓంకారము పరంబ్రహ్మ అని చెప్పబడుచున్నది.
సమస్త పదార్థములను చూచుచుండుటవలనను, ఆత్మజ్ఞానమును కలుగజేయుటవలనను, యోగమును (జీవబ్రహ్మైక్యమును) పొందింపజేయుటవలనను, పరమాత్మ భగవాన్ అని చెప్పబడుచున్నాడు.
ఓ జనులారా! ఈ ఏకరూపుడై స్వయంప్రకాశుడైన దేవుడు సమస్త దిక్కులను, అహంతర దిక్కులను వ్యాపించియున్నాడు. అతడే సర్వులకు పుర్వుడుగా ఉదయించెను. మరియు బ్రహ్మాండ గర్భములో అతడే పుట్టినవాడు, అతడే పుట్టబోవువాడు. అతడు ప్రత్యగాత్మ స్వరూపుడు, సర్వతోముఖుడు అయి యున్నాడు.
కేశాగ్రభాగ(సూక్ష్మ) పరిమాణము కలిగియున్నవాడును, హృదయమందుండువాడును, విశ్వస్వరూపుడును, స్వయంప్రకాశుడును, వేదమునకు ఉత్పత్తిస్థానమైనవాడును, శ్రేష్టుడును, అంతఃకరణమున ఉన్నవాడును అగు పరమాత్మను ఏ ధీరులు చూచుచున్నారో అట్టివారికి శాశ్వతమగు శాంతి కలుగునుగాని ఇతరులకు కాదు.
ఒక్కడగు ఏ పరమాత్మ ప్రతి శరీరమునందును వెలయుచున్నడో, ఎవనిచే ఈ పంచవిధమైన సకల ప్రపంచము స్థితిని బొందియున్నదో, సర్వనియంతయు పరిపూర్ణుడును, స్వయంప్రకాశుడును, స్తుతింపదగినవాడును అగు అట్టి పరమాత్మను ధ్యానించవలయును. అట్టి ధ్యానముచే సంసారతారకమగు మహత్తర శాంతిని మనుజుడు చక్కగా పొందుచున్నాడు.
అగ్నియే భస్మము, వాయువే భస్మము, జలమే భస్మము, స్థలమే భస్మము, ఆకాశమే భస్మము, ఈ సమస్తము భస్మము, మనస్సు, ఈ నేత్రాది ఇంద్రియములను భస్మమే. అగ్నిరితిభస్మ ఈ మున్నగు ఏడు మంత్రములచేత భస్మమును గ్రహించి, దేహమునకు పూసికొని శిరస్సు మొదలగు అవయవములను తాకవలెను .అందుచేత ఈ వ్రతము పాశుపతము అనబడుచున్నది. ఇది అజ్ఞానులగు జీవులయొక్క అజ్ఞాన, తత్కార్యములయొక్క విమోక్షణము కొఱకు అయియున్నది.

Tuesday, January 28, 2014

21. అమృతనాదోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

బుద్ధిమంతుడు శాస్త్రములను బాగుగా అధ్యయనము చేసి, అందలి ధర్మములను మరల మరల అభ్యాసము చేసి పరబ్రహ్మమును తెలిసికొని, ఆ పిదప కోరదగినవి కాని వాటినన్నిటిని త్యజించవలెను.
ఓంకారమను రధమునెక్కి, విష్ణుమూర్తిని సారధిగా జేసికొని పరబ్రహ్మ స్థానమును వెదకుచు రుద్రారాధన తత్పరుడవై యుండవలెను.
బ్రహ్మలోక యాత్రాపరుడైన సాధకుడు రాధమార్గ మున్నంతవరకు రాధాములోపోయి, తదుపరి రధమును వీడి బ్రహ్మలోకమున కేగవలెను.
శబ్ద, స్పర్శాది విషయములైదు, అతిచంచలమగు మనస్సు అను పగ్గములను వశమునందుంచుకొని, సంయమశీలుడై యుండుట ప్రత్యాహార మనబడును.
ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామం, ధారణ, సత్యా సత్య విచారణ, సమాధి అను ఆరు అంగములు యోగమని చెప్పబడును.
పర్వత (గైరిక) ధాతువులను కొలిమిలో పెట్టి ఊదుటవలన, వాని యందలి మాలిన్యము తొలగి పోవునట్లు, ఇంద్రియములకు చెందిన దోషములు ప్రాణాయామముచే నశించిపోవు చున్నవి.
ప్రాణాయామముచే మనస్సునందలి దోషములను నశింపజేయవలెను. ధారణీలతో పాపమును నశింపజేయవలెను. ప్రత్యాహారముచే సంసర్గదోషములను నశింపజేయవలెను. ధ్యానముచే అనాత్మీయములైన ప్రాకృతగుణములను నశింప చేయవలెను.
పాపమును నశింపజేసికొని ఉత్తమమైన ఆత్మను గూర్చి చింతన చేయవలెను.
న్యాహృతితో కూడినదియు, ఓంకారసహితమైనదియు నగు గాయత్రిమంత్రమును శిరస్సుతో గూడ ప్రాణసంయమశీలుడైన సాధకుడు మూడుసార్లు పఠించవలెను. అయ్యది ప్రాణాయామమనబడును.
గ్రుడ్డివానివలె రూపములను చూడుము. చెవిటివానివలె శబ్దములను వినుము. దేహమును కొయ్యవలె చూడుము. ఇదియే ప్రశాంతుని యొక్క లక్షణమై యున్నది.
సంకల్పరూపమైన మనస్సును విచారణచే బాగుగా తెలిసికొని బుద్ధిమంతుడు తన యా మనస్సును ఆత్మయందు స్థాపించి, ధ్యానశీలుడై యుండుట ధారణ యనబడును.
వేదములను అనుగుణ్యముగా ఊహించుట తర్కమని చెప్పబడును. దేనిని పొంది సర్వత్ర సమముగా నున్న పరబ్రహ్మమందు నిలుకడగలగి యుండునో అది సమాధియని చెప్పబడును.
ఏకాక్షరమును, బ్రహ్మస్వరూపమును అగు ఓంకారముతో బ్రహ్మధ్యానపూర్వకముగా రేచకము సలుపవలెను. ఈ ప్రకారముగా దివ్యమంత్రముతో అనేక పర్యాయములు రేచకాదులను సలుపుచు, మనస్సునందలి దోషములెల్ల నశించి పోవువరకు ఆ ప్రకారము జపధ్యానాదులను గావించుచుండవలెను.
అడ్డముగాని, నిలువుగాని, క్రిందుగాను ప్రసరించునట్టి దృష్టినివీడి ధ్యానశీలుడు స్థైర్యము కలవాడై, నిశ్చల శరీరుడై సదా యోగమును లెస్సగా అభ్యాసము చేయవలెను.

ధ్యానపరుడైన యోగి భయమును, క్రోధమును, సోమరితనమును ,అతినిద్రను, అతిజాగారనమును, అధికాహారమును ,ఆహారములేమిని, సదా వర్జించవలెను.   

Wednesday, January 15, 2014

20. అమ్రుతబిందూపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

మనస్సు శుద్ధ మనియు, అశుద్ధ మనియు రెండు విధములుగా చెప్పబడినది. కోరికలుకల మనస్సు ఆశుద్దమును, కోరికలులేని మనస్సు శుద్దమును అగును.
మనుజుల యొక్క బంధ, మోక్షములకు కారణము మనస్సే అయి యున్నది. విషయములందు ఆసక్తమైయున్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును.
విషయాసక్తముకాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పబడినందు వలన ముముక్షువు నిత్యము తన మనస్సును విషయ రహితముగా చేయవలెను.
విషయమందలి ఆశక్తిని వదలి హృదయమందు చక్కగా నిరోధింపబడి ఎపుడు మనస్సు సదా ఆత్మ స్వరూపమును పొందునో అపుడది ఉత్తమమైన పదము(స్థానము) కాగలదు.
హృదయమందలి సంకల్పములు క్షయ మగునంతన అగు మనస్సును నిరోధింపవలయును. ఇదియే ధ్యానము. ఇదియే యోగము, తక్కిన న్యాయము (వాక్యము) లన్నియు నిస్సారమే కాగలవు.
ఆ బ్రహ్మము నిష్కలమై, నిర్వికల్పమై, నిరంజనమై యున్నది. ఆ బ్రహ్మము నేను అని తెలిసికొనిన యెడల మనుజుడు సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు.
నిర్వికల్పమై, అనంతమై, కారనవర్జితమై, దృష్టాంతరహితమై అప్రమేయమై, అనాదియైనట్టి ఆ బ్రహ్మమును తెలిసికొని జ్ఞానీ బంధమునుండి విడివడు చున్నాడు.
నిరోధము లేదు, ఉత్పత్తిలేదు, బద్దుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు ఇదియే పరమార్ధ తత్త్వము.
మననము చేయదగిన ఆత్మ జాగ్రత్ ,స్వప్న, సుషుప్తులయందు ఒక్కటే అయియున్నది. ఆ జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడు అవస్థలను దాటినవానికి పునర్జన్మము లేదు.
ప్రాణులకు అత్మయైనది ఒక్కటే. అది సమస్త ప్రానులందును కలదు. ఆ ఆత్మ నీటి యందు చంద్రునివలె ఒకటిగాను ,అనేకము గాను కనుపించుచున్నది.
శబ్దాది ప్రపంచరూపమాయచే ఆవరింపబడి యుండువాడు ఆ మాయమగు అందకారము నుండి ప్రకాశమునకు వచ్చుట లేదు. (ప్రకాశరూప బ్రహ్మమును తెలిసికొనుట లేదు). ఆ అంధకారము తొలగినచో ఏకమైన స్థితిని ఒక్కడుగానే చూచుచున్నాడు.  
ప్రణవశబ్దమునందు నాశరహితమైన శ్రేష్టమైన బ్రహ్మము కలదు. ఆ ప్రణవశబ్దము లయించగా ఏ అక్షర పరబ్రహ్మము శేషించుచున్నాడో, ఆ నాశరహితమగు పరబ్రహ్మమును ఆత్మ శాంతిని కోరు జ్ఞాని సదా ధ్యానించవలెను.
బుద్ధిశాలి వేదశాస్త్రాది గ్రంధములను బాగుగా అభ్యసించి జ్ఞాన, విజ్ఞానములందు తత్పరుడై, ఆ తదుపరి ధ్యానమును కోరువాడు పొత్తును వదలివేయునట్లు ఆ గ్రంధము నన్నిటిని వదిలి వేయవలెను.
ఆవులు పలురంగులు కలవి అయియున్నవి, వాని యొక్క పాలు ఒకేవర్ణము కలిగియుండు చున్నది. ప్రపంచమందలి బహువిధరూపములు ఆవులు. జ్ఞానరూపమగు ఆత్మ పాలలాంటిది.
పాలయందు నేయి నిగూడముగా నుండునట్లు ప్రతిప్రాణి యందును విజ్ఞానరూపమగు ఆత్మ నిగూఢముగా నున్నది. సదా మనస్సును మధించి ఆ అత్మయను నవనీతమును వెలువరించవలెను.     
మనుజుడు జ్ఞాననేత్రము కలవాడై మనస్సును మదించి నిష్కలమై, నిశ్చలమై, శాంతమైనట్టి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మమును అనుభూత మొనర్చుకొనవలెను.
సమస్త ప్రాణులకు ఆధారముగా నున్నవాడనై, సమస్త ప్రాణులందు నివసించుచు, సమస్త ప్రాణులను సంరక్షించుచున్న వాసుదేవుడే నేను, ఆ వాసుదేవుడే నేను.

19. పరమహంసోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

పరమహంసయగువాడు తనచిత్తమును నాయందే (భగవంతుని యందే) స్థాపించును. కాబట్టి నేనును అతనియందు ఉండుచున్నాను.
పరమహంస సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండమును (బ్రహ్మాండ భావమును) కూడ వదలివైచి (ఆత్మపరాయణుడై) యుండును.   
పరమహంస తన దేహమును శవము మాడ్కి (జడముగ) చూచును.
పరమహంస కోరిక లన్నింటిని త్యజించివైచి అద్వైత పరమాత్మయందు మనస్సును స్థాపించియుండును.
జ్ఞానదండమును ఎవడు ధరించునో అతడు ఎకదండి సన్యాసి యనబడును.
ఎవడు కేవలము కాష్టదండమును మాత్రము గ్రహించిన వాడను, ప్రాపంచిక భోగము లన్నింటిని అనుభావించువాడును, ఆధ్యాత్మిక జ్ఞానము లేనివాడును, తితిక్ష (ఓర్పు), జ్ఞానము, వైరాగ్యము, శమదమాదిగుణములు లేనివాడును, భిక్షాచరణ మాత్రముతో కాలమును గడపువాడును అయియుండునో అతడు పాపియు యాత్యాశ్రమవృత్తిని నశింపజేసినవాడును అగును.

Sunday, December 22, 2013

18. నారాయణోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

నారాయణుడు(పరమాత్మ) నిత్యుడు, బ్రహ్మదేవుడు నారాయణుడే, శివుడు నారాయణుడే, ఇంద్రుడు నారాయణుడే, భూమ్యాకాషములు నారాయణుడే, కాలతత్వము నారాయణుడే, దశాదిక్కులు నారాయణుడే, ఊర్ద్వభాగమున ఉన్నదంతయు నారాయణుడే, అధోభాగమున ఉన్నదంతయు నారాయణుడే, మధ్యభాగమున ఉన్నదంతయు నారాయణుడే, బహ్యాభ్యంతరముల యందున్న దంతయు నారాయణుడే. ఈ సమస్తము నారాయణుడే, భూత భవిష్య ద్వార్తమానము లన్నియు నారాయణుడే, నారాయణుడు. నిష్కలంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, వాక్కుచే నిర్వచింపశక్యము కానివాడు, శుద్దుడు, దేవుడు ,అద్వితీయుడు, అతడు తప్ప మరియొకడు ఎవడును లేడు ఈ ప్రకారముగా తెలిసికొను వాడు విష్ణువే యగు చున్నాడు.
మొదట ఓమ్ అని ఉచ్చరించవలెను. తదుపరి నమో అని ఉచ్చరించవలెను. పిమ్మటనారాయణ అని ఉచ్చరించవలెను. ఇదియే అష్టాక్షర మహామంత్రము. ఎనిమిది ఎనిమిది అక్షరాములుకల ఈ మంత్రమును ఎవడు భక్తీ శ్రద్దలతో, ప్రీతితో, విశ్వాసముతో స్మరణము చేయునో అతడు దీర్ఘాయుస్సు కలవాడగును; ప్రజాపతిత్వమును పొందును. స్వర్గాదిపత్యమును బడయును. ధనదాన్యాది ఐశ్వర్యమును, సంపదను పొందును. ఎవడు దీని నెరుంగునో అతడు అమృతత్వమును (మోక్షమును) బడయుచున్నాడు.
కార, కార, కారములను ఈ మూడక్షరములను కలిపి ఓమ్ అను ప్రణవ మగుచున్నది. ఈ ప్రణవమునకు అర్ధము ప్రత్యగానందస్వరూపమగు పరబ్రహ్మము. ఈ ఓంకారమును అర్ధయుక్తముగా స్మరణచేయు యోగి జనన మరణ రూప సంసారబంధనము నుండి విడివడుచున్నాడు. ఓం నమో నారాయణ అను అష్టాక్షర మంత్రమును ఉపాసించువాడు వైకుంఠలోకమును పొందుచున్నాడు. సర్వవ్యాపకమగు ఆ పరబ్రహ్మ హృదయ పుండరీకమందు విజ్ఞానఘనమై, అంతర్యామిగా, అంతరాత్మగా ప్రకాశించుచున్నది. అది మెరుపువలె ప్రకాశమానమైనది. పరబ్రహ్మ స్వరూపుడగు నారాయణుడు బ్రహ్మన్యుడు. సమస్తప్రాణులయందును ఒక్కడే నారాయణుడు అంతర్యామియై వేలుగొందుచున్నాడు. అతడు సర్వవ్యాపియై ఈ సమస్త ప్రపంచమునకు కారణభూతుడై, తనకు వేరొకకారణమేదియు లేనివాడై వెలయుచున్నాడు.

17. గర్భోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

ఋతుకాలమున సంయోగనంతరము ఒక్కరాత్రియుండెనేని (శుక్ల శోణిత పదార్థము) ముద్ద అగుచున్నది. ఏడురోజులు ఉండినచో బుగ్గ అగుచున్నది. పదునైదు దినములకు పిండమగుచున్నది. ఒక నెలకు గట్టియగుచున్నది. రెండు నెలలకు కాళ్ళు కలుగుచున్నవి. నాలుగు నెలలకు కడుపు, నడుము కలుగుచున్నవి. ఐదవ నెల వెన్నెముక కలుగుచున్నది. ఆరవనెల ముక్కు, కన్నులు, చెవులు కలుగుచున్నవి. ఏడవనెల ప్రాణము కలుగుచున్నది. ఎనిమిదవనెల శరీరముయొక్క అవయవములన్నియు సంపూర్ణముగా కలుగును. తోమ్మిదవనెల సంచరించుచున్నది.
గర్భస్తమగు శిశువు పంచభూతస్వరూపుడును, సమర్దుడును అగుచున్నాడు. పంచేంద్రియాలతో గూడి అతడు గంధరసాధులను ఎరుగుచున్నాడు. మంచి జ్ఞానముచేతను, ధ్యానముచేతను ఓంకారమును ఎరుగుచున్నాడు. పరబ్రహ్మ స్వరూపమైన ఆ ఏకాక్షరమును (ప్రణవమును) తెలిసికొనుచున్నాడు. ఈ శరీరమునందు ఎనిమిది ప్రకృతులను, పదునారు వికారములును కలవు. తొమ్మిదవ నెలయందు అన్ని లక్షణములును పూర్తియగుచున్నవి. అత్తరి జీవుడు తన పూర్వపుజాతిని, పూర్వపుకర్మను, చేయబోవు కర్మను, మంచికర్మను, చెడ్డకర్మను తెలిసికొనుచున్నాడు.
(అప్పుడు గర్భస్థజీవుడు ఈ ప్రకారముగా చింతన చేయుచున్నాడు). నేను అనేక స్త్రీ యోనులను చూచినాను. అనేకములైన్ ఆహారములను భుజించితిని. అనేక స్తనములద్వార క్షీరమును పానము చేసితిని.
నాకు సమస్త భూమియు జన్మభూమియే. సమస్తభూమియు శ్మశానమే. నేను ఎనుబదినాలుగు లక్షల యోనిభేదములందు జన్మించితిని.
ఎన్నియోసార్లు పుట్టితిని, ఎన్నియోసార్లు చచ్చితిని. ఎన్నియోసార్లు సంసారినై యుంటిని. పుట్టుట, చచ్చుట, మరల పుట్టుట, చచ్చుట ఈ ప్రకారముగా నా కాలము గడచిపోయినది.
గర్భావాసము మహాదుఃఖకరమైనది జన్మల నెత్తుటయందలి మోహము మహాదుఃఖకరమైనది. బాల్యమునందు దుఃఖము, శోకము, పరవశత్వము, మూఢత్వము కలుగుచున్నవి.
యౌవనమునందు హితకార్యములు చేయక పోవుటయు, సోమరితనము, ఆహితకార్యముల నాచరించుట, విషయాశక్తి, తాపత్రయముచే బాధింపబడుట సంభవించుచున్నవి.
వార్ధక్యమునందు చింతయు, రోగములు కలుగుచున్నవి. మరణమునందు మహాభాయము కలుగుచున్నది. ఆశచేతను, అభిమానముచేతను అధికమైన కామక్రోధాదుల సంకటమునందు తగుల్కొనుటచేతను, అస్వతంత్రతచేతను మిక్కిలి దుఃఖము కలుగుచున్నది.
జన్మము దుఃఖమునకు కారణమైయున్నది. దుఃఖరూపమైనది. మిగుల సహింపరానిదై యున్నది. నేను నివృత్తి ధర్మమును ఏమియు చేయలేదు. యోగాము యొక్కగాని, జ్ఞానము యొక్కగాని సాధన మేమియు చేయలేదు.
ఆహా! దుఃఖసముద్రమున నేను మునిగియున్నాను. దీనికి ప్రతీకార మేమియు ఎరుగక యున్నాను. అజ్ఞానమునకు మరల మరల దిక్కారమగుగాక!
సంసారమను గోలుసునకు దిక్కరమగుగాక! ఈ గర్భము నుండి బయటకు వచ్చిన పిదప సద్గురువును ఆశ్రయించి జ్ఞానమును బొందదెను. ఈ యోని ద్వారమునుండి వెలువడినచో నేను సాంఖ్యయోగమును లెస్సగ ఆశ్రయించెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, మోక్షఫలము నొసంగు వాడను అగు మహేశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, పురుషార్ధములు నొసంగువాడను అగు జగదీశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, సర్వశక్తిమంతుడును, సర్వకారణములకును కారణభూతమైనవాడును, భర్గుడును, పశుపతియు, రుద్రుడును, మహాదేవుడును, జగద్గురువును అయిన పరమేశ్వరుని శరణుబొందేదను .
ఈ యోని బంధమునుండి వెలువడినచో గొప్పతపస్సు నాచరించెదను.
ఈ గర్భావాసమునుండి బయటకు వచ్చినచో అమృతత్వమును (మోక్షమును) కలుగాజేయువాడును, ఆనందరూపుడును, నారాయానుడును అగు విష్ణువును హృదయ మందు ధ్యానించెదను.
నేనిపుడు తల్లిగర్భమందు బంధింపబడి యున్నాను. ఈబంధనములనుండి విడుదలయైనచో భగవంతుడు వాసుదేవుని అనన్యచిత్తముతో భజించి సంతోషపరచెదను.
పూర్వము నేను ఇతరులకొరకై కర్మలనుచేసితిని. ఇపుడు ఒంటరిగానే బాధింపబడుచున్నాను. ఫలమును బొందినవారందరును వెడలిపోయిరి.
పూర్వము నేను నాస్తికుడనై భయమును వదలి అనేక పాపములను చేసితిని. ఇప్పు డా పాపఫలమును అనుభవించుచున్నాను. ఇక మీదట నేను ఆస్తికుడనై యుండెదను.
ఈ ప్రకారముగా అనేకవిధములైన అనర్ధములను గురించి మాటి మాటికి చిన్తనచేసి, జనన మరణరూప సంసారదుఖమును పలుమార్లు సంస్మరించి గర్భామునందలి జీవుడు వైరాగ్యమునుబొంది అజ్ఞానము, కామము, కర్మము మున్నగువానిచే మోహము నొందుచున్నాడు.
ఆ జీవుడు వందలకొలది స్త్రీల యోనిద్వారములను పొందియున్నాడు. ఇపుడు ఆ యోని ద్వారమునుండి విడుదల పొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు శక్తిలేనివాడై యంత్రము నందు తగుల్కొనినట్లు పీడింపబడుచున్నాడు. దుఃఖాతి శయముచే క్లేశము నొందుచున్నాడు. ప్రసవవాయువుచేత పీడింపబడుచున్నాడు. జనన మొందిన వెంటనే అతడు వైష్ణవ వాయువుచే వ్యాపింపబడుచున్నాడు. అత్తరి అతడు పరలోకసాధనను దేనిని స్మరించుటలేదు. అపుడు అపరోక్షజ్ఞానము లేక యుండును.
భూమియొక్క స్పర్శఅయిన వెంటనే జీవుడును క్రూరదృష్టి కల వాడును, పామరుడును అగుచున్నాడు. జలముచే కడుగబడిన తరువాత అతనికి ఆ దృష్టిదోషము తోలగుచున్నది.
జీవుడు పుట్టిన తరువాత అతనికి జననము, మరణము, కర్మము, శుభాశుభ సాధనములు అను ఈ ప్రకారములైన విషయము లెవ్వియును గోచరించుటలేదు. అతనికి వాసనలు అన్నియు నిగూఢములై యుండును.
ఈ శరీరమందు ఎనిమిది కోట్ల రోమములు, ఎనిమిది వందల సంధులు, తొమ్మిదివందల నారములు కలవు. గుండె ఎనిమిదిపలములు, నాలుక పండ్రండు వలములు అన్నియు నశించునవి యని తెలిసికొని గర్భమందలి జీవునివలె సుషుమ్నయందు స్థానముగనుండి వివేకవంతుడై ముని కావలెను. అట్టి జ్ఞాని యిక దేహము నొందుట లేదు.
అట్లుగాక, అజ్ఞానముచే సంసారమును పొందువానికి కీటకమునకువలె నరకముతో సమానమైన ఈ దేహమందు, మూత్రపురీషపానము చేయు దుఃస్థితికలుగును. ఈ తత్వము నేరిగినచో జీవుడు విరక్తిజెందును అని పిప్పలాద మహర్షి చెప్పెను.      

Thursday, December 19, 2013

15. హంసోపనిషత్తు & 16. అరుణికోపనిషత్తు


ఓం నమో పరమాత్మయే నమః 

15. హంసోపనిషత్తు
హంస హంస అని పరమహంస స్వరూపమును (భాగవత్స్వరూపమును) సదా ధ్యానించునట్టియు, ఇంద్రియ నిగ్రహము గలిగినట్టియు, గురుభక్తుడును అగు బ్రహ్మనిష్టునకు జ్ఞానము బోధింపబడుచున్నది.
కొయ్యయందు అగ్నివలెను, నువ్వులందు నూనెవలెను, సమస్త దేహములందును వ్యాపించియున్న పరమాత్మను తెలిసి కొనినవాడు మృత్యువును (జనన మరణములను) పొందడు.
జ్ఞానముచేత మనస్సు లయింపబడగా, మనస్సునందలి సంకల్పవికల్పములు తొలగిపోగా, పుణ్యపాపములు (జ్ఞానాగ్ని చేత) దగ్దములు కాగా, సర్వశక్తిస్వరూపుడును, సర్వత్ర వేలుయుచుండువాడును, స్వయంజ్యోతి స్వరూపుడును, శుద్దుడును, బుద్దుడును, నిత్యుడును, నిరంజనుడును, శాంతుడును అగు సదా శివుడు (పరమాత్మ) ప్రకాశించుచున్నాడు (అనుభూతుడగుచున్నాడు).

16. అరుణికోపనిషత్తు
ఔషదమును స్వీకరించునట్లు భోజనమును (మితముగా) భుజింపవలెను. బ్రహ్మచర్యమును, అహింసను, అపరిగ్రహమును, సత్యమును ప్రయత్న పూర్వకముగా తప్పక రక్షింపవలయును (అవలంబించవలెను).
కామము, క్రోధము, హర్షము, రోషము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఇచ్ఛ, అసూయ, మమత్వము, అహంకారము మున్నగువానిని పరిత్యజించవలెను.