Sunday, December 22, 2013

18. నారాయణోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

నారాయణుడు(పరమాత్మ) నిత్యుడు, బ్రహ్మదేవుడు నారాయణుడే, శివుడు నారాయణుడే, ఇంద్రుడు నారాయణుడే, భూమ్యాకాషములు నారాయణుడే, కాలతత్వము నారాయణుడే, దశాదిక్కులు నారాయణుడే, ఊర్ద్వభాగమున ఉన్నదంతయు నారాయణుడే, అధోభాగమున ఉన్నదంతయు నారాయణుడే, మధ్యభాగమున ఉన్నదంతయు నారాయణుడే, బహ్యాభ్యంతరముల యందున్న దంతయు నారాయణుడే. ఈ సమస్తము నారాయణుడే, భూత భవిష్య ద్వార్తమానము లన్నియు నారాయణుడే, నారాయణుడు. నిష్కలంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, వాక్కుచే నిర్వచింపశక్యము కానివాడు, శుద్దుడు, దేవుడు ,అద్వితీయుడు, అతడు తప్ప మరియొకడు ఎవడును లేడు ఈ ప్రకారముగా తెలిసికొను వాడు విష్ణువే యగు చున్నాడు.
మొదట ఓమ్ అని ఉచ్చరించవలెను. తదుపరి నమో అని ఉచ్చరించవలెను. పిమ్మటనారాయణ అని ఉచ్చరించవలెను. ఇదియే అష్టాక్షర మహామంత్రము. ఎనిమిది ఎనిమిది అక్షరాములుకల ఈ మంత్రమును ఎవడు భక్తీ శ్రద్దలతో, ప్రీతితో, విశ్వాసముతో స్మరణము చేయునో అతడు దీర్ఘాయుస్సు కలవాడగును; ప్రజాపతిత్వమును పొందును. స్వర్గాదిపత్యమును బడయును. ధనదాన్యాది ఐశ్వర్యమును, సంపదను పొందును. ఎవడు దీని నెరుంగునో అతడు అమృతత్వమును (మోక్షమును) బడయుచున్నాడు.
కార, కార, కారములను ఈ మూడక్షరములను కలిపి ఓమ్ అను ప్రణవ మగుచున్నది. ఈ ప్రణవమునకు అర్ధము ప్రత్యగానందస్వరూపమగు పరబ్రహ్మము. ఈ ఓంకారమును అర్ధయుక్తముగా స్మరణచేయు యోగి జనన మరణ రూప సంసారబంధనము నుండి విడివడుచున్నాడు. ఓం నమో నారాయణ అను అష్టాక్షర మంత్రమును ఉపాసించువాడు వైకుంఠలోకమును పొందుచున్నాడు. సర్వవ్యాపకమగు ఆ పరబ్రహ్మ హృదయ పుండరీకమందు విజ్ఞానఘనమై, అంతర్యామిగా, అంతరాత్మగా ప్రకాశించుచున్నది. అది మెరుపువలె ప్రకాశమానమైనది. పరబ్రహ్మ స్వరూపుడగు నారాయణుడు బ్రహ్మన్యుడు. సమస్తప్రాణులయందును ఒక్కడే నారాయణుడు అంతర్యామియై వేలుగొందుచున్నాడు. అతడు సర్వవ్యాపియై ఈ సమస్త ప్రపంచమునకు కారణభూతుడై, తనకు వేరొకకారణమేదియు లేనివాడై వెలయుచున్నాడు.

17. గర్భోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

ఋతుకాలమున సంయోగనంతరము ఒక్కరాత్రియుండెనేని (శుక్ల శోణిత పదార్థము) ముద్ద అగుచున్నది. ఏడురోజులు ఉండినచో బుగ్గ అగుచున్నది. పదునైదు దినములకు పిండమగుచున్నది. ఒక నెలకు గట్టియగుచున్నది. రెండు నెలలకు కాళ్ళు కలుగుచున్నవి. నాలుగు నెలలకు కడుపు, నడుము కలుగుచున్నవి. ఐదవ నెల వెన్నెముక కలుగుచున్నది. ఆరవనెల ముక్కు, కన్నులు, చెవులు కలుగుచున్నవి. ఏడవనెల ప్రాణము కలుగుచున్నది. ఎనిమిదవనెల శరీరముయొక్క అవయవములన్నియు సంపూర్ణముగా కలుగును. తోమ్మిదవనెల సంచరించుచున్నది.
గర్భస్తమగు శిశువు పంచభూతస్వరూపుడును, సమర్దుడును అగుచున్నాడు. పంచేంద్రియాలతో గూడి అతడు గంధరసాధులను ఎరుగుచున్నాడు. మంచి జ్ఞానముచేతను, ధ్యానముచేతను ఓంకారమును ఎరుగుచున్నాడు. పరబ్రహ్మ స్వరూపమైన ఆ ఏకాక్షరమును (ప్రణవమును) తెలిసికొనుచున్నాడు. ఈ శరీరమునందు ఎనిమిది ప్రకృతులను, పదునారు వికారములును కలవు. తొమ్మిదవ నెలయందు అన్ని లక్షణములును పూర్తియగుచున్నవి. అత్తరి జీవుడు తన పూర్వపుజాతిని, పూర్వపుకర్మను, చేయబోవు కర్మను, మంచికర్మను, చెడ్డకర్మను తెలిసికొనుచున్నాడు.
(అప్పుడు గర్భస్థజీవుడు ఈ ప్రకారముగా చింతన చేయుచున్నాడు). నేను అనేక స్త్రీ యోనులను చూచినాను. అనేకములైన్ ఆహారములను భుజించితిని. అనేక స్తనములద్వార క్షీరమును పానము చేసితిని.
నాకు సమస్త భూమియు జన్మభూమియే. సమస్తభూమియు శ్మశానమే. నేను ఎనుబదినాలుగు లక్షల యోనిభేదములందు జన్మించితిని.
ఎన్నియోసార్లు పుట్టితిని, ఎన్నియోసార్లు చచ్చితిని. ఎన్నియోసార్లు సంసారినై యుంటిని. పుట్టుట, చచ్చుట, మరల పుట్టుట, చచ్చుట ఈ ప్రకారముగా నా కాలము గడచిపోయినది.
గర్భావాసము మహాదుఃఖకరమైనది జన్మల నెత్తుటయందలి మోహము మహాదుఃఖకరమైనది. బాల్యమునందు దుఃఖము, శోకము, పరవశత్వము, మూఢత్వము కలుగుచున్నవి.
యౌవనమునందు హితకార్యములు చేయక పోవుటయు, సోమరితనము, ఆహితకార్యముల నాచరించుట, విషయాశక్తి, తాపత్రయముచే బాధింపబడుట సంభవించుచున్నవి.
వార్ధక్యమునందు చింతయు, రోగములు కలుగుచున్నవి. మరణమునందు మహాభాయము కలుగుచున్నది. ఆశచేతను, అభిమానముచేతను అధికమైన కామక్రోధాదుల సంకటమునందు తగుల్కొనుటచేతను, అస్వతంత్రతచేతను మిక్కిలి దుఃఖము కలుగుచున్నది.
జన్మము దుఃఖమునకు కారణమైయున్నది. దుఃఖరూపమైనది. మిగుల సహింపరానిదై యున్నది. నేను నివృత్తి ధర్మమును ఏమియు చేయలేదు. యోగాము యొక్కగాని, జ్ఞానము యొక్కగాని సాధన మేమియు చేయలేదు.
ఆహా! దుఃఖసముద్రమున నేను మునిగియున్నాను. దీనికి ప్రతీకార మేమియు ఎరుగక యున్నాను. అజ్ఞానమునకు మరల మరల దిక్కారమగుగాక!
సంసారమను గోలుసునకు దిక్కరమగుగాక! ఈ గర్భము నుండి బయటకు వచ్చిన పిదప సద్గురువును ఆశ్రయించి జ్ఞానమును బొందదెను. ఈ యోని ద్వారమునుండి వెలువడినచో నేను సాంఖ్యయోగమును లెస్సగ ఆశ్రయించెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, మోక్షఫలము నొసంగు వాడను అగు మహేశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, పురుషార్ధములు నొసంగువాడను అగు జగదీశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, సర్వశక్తిమంతుడును, సర్వకారణములకును కారణభూతమైనవాడును, భర్గుడును, పశుపతియు, రుద్రుడును, మహాదేవుడును, జగద్గురువును అయిన పరమేశ్వరుని శరణుబొందేదను .
ఈ యోని బంధమునుండి వెలువడినచో గొప్పతపస్సు నాచరించెదను.
ఈ గర్భావాసమునుండి బయటకు వచ్చినచో అమృతత్వమును (మోక్షమును) కలుగాజేయువాడును, ఆనందరూపుడును, నారాయానుడును అగు విష్ణువును హృదయ మందు ధ్యానించెదను.
నేనిపుడు తల్లిగర్భమందు బంధింపబడి యున్నాను. ఈబంధనములనుండి విడుదలయైనచో భగవంతుడు వాసుదేవుని అనన్యచిత్తముతో భజించి సంతోషపరచెదను.
పూర్వము నేను ఇతరులకొరకై కర్మలనుచేసితిని. ఇపుడు ఒంటరిగానే బాధింపబడుచున్నాను. ఫలమును బొందినవారందరును వెడలిపోయిరి.
పూర్వము నేను నాస్తికుడనై భయమును వదలి అనేక పాపములను చేసితిని. ఇప్పు డా పాపఫలమును అనుభవించుచున్నాను. ఇక మీదట నేను ఆస్తికుడనై యుండెదను.
ఈ ప్రకారముగా అనేకవిధములైన అనర్ధములను గురించి మాటి మాటికి చిన్తనచేసి, జనన మరణరూప సంసారదుఖమును పలుమార్లు సంస్మరించి గర్భామునందలి జీవుడు వైరాగ్యమునుబొంది అజ్ఞానము, కామము, కర్మము మున్నగువానిచే మోహము నొందుచున్నాడు.
ఆ జీవుడు వందలకొలది స్త్రీల యోనిద్వారములను పొందియున్నాడు. ఇపుడు ఆ యోని ద్వారమునుండి విడుదల పొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు శక్తిలేనివాడై యంత్రము నందు తగుల్కొనినట్లు పీడింపబడుచున్నాడు. దుఃఖాతి శయముచే క్లేశము నొందుచున్నాడు. ప్రసవవాయువుచేత పీడింపబడుచున్నాడు. జనన మొందిన వెంటనే అతడు వైష్ణవ వాయువుచే వ్యాపింపబడుచున్నాడు. అత్తరి అతడు పరలోకసాధనను దేనిని స్మరించుటలేదు. అపుడు అపరోక్షజ్ఞానము లేక యుండును.
భూమియొక్క స్పర్శఅయిన వెంటనే జీవుడును క్రూరదృష్టి కల వాడును, పామరుడును అగుచున్నాడు. జలముచే కడుగబడిన తరువాత అతనికి ఆ దృష్టిదోషము తోలగుచున్నది.
జీవుడు పుట్టిన తరువాత అతనికి జననము, మరణము, కర్మము, శుభాశుభ సాధనములు అను ఈ ప్రకారములైన విషయము లెవ్వియును గోచరించుటలేదు. అతనికి వాసనలు అన్నియు నిగూఢములై యుండును.
ఈ శరీరమందు ఎనిమిది కోట్ల రోమములు, ఎనిమిది వందల సంధులు, తొమ్మిదివందల నారములు కలవు. గుండె ఎనిమిదిపలములు, నాలుక పండ్రండు వలములు అన్నియు నశించునవి యని తెలిసికొని గర్భమందలి జీవునివలె సుషుమ్నయందు స్థానముగనుండి వివేకవంతుడై ముని కావలెను. అట్టి జ్ఞాని యిక దేహము నొందుట లేదు.
అట్లుగాక, అజ్ఞానముచే సంసారమును పొందువానికి కీటకమునకువలె నరకముతో సమానమైన ఈ దేహమందు, మూత్రపురీషపానము చేయు దుఃస్థితికలుగును. ఈ తత్వము నేరిగినచో జీవుడు విరక్తిజెందును అని పిప్పలాద మహర్షి చెప్పెను.      

Thursday, December 19, 2013

15. హంసోపనిషత్తు & 16. అరుణికోపనిషత్తు


ఓం నమో పరమాత్మయే నమః 

15. హంసోపనిషత్తు
హంస హంస అని పరమహంస స్వరూపమును (భాగవత్స్వరూపమును) సదా ధ్యానించునట్టియు, ఇంద్రియ నిగ్రహము గలిగినట్టియు, గురుభక్తుడును అగు బ్రహ్మనిష్టునకు జ్ఞానము బోధింపబడుచున్నది.
కొయ్యయందు అగ్నివలెను, నువ్వులందు నూనెవలెను, సమస్త దేహములందును వ్యాపించియున్న పరమాత్మను తెలిసి కొనినవాడు మృత్యువును (జనన మరణములను) పొందడు.
జ్ఞానముచేత మనస్సు లయింపబడగా, మనస్సునందలి సంకల్పవికల్పములు తొలగిపోగా, పుణ్యపాపములు (జ్ఞానాగ్ని చేత) దగ్దములు కాగా, సర్వశక్తిస్వరూపుడును, సర్వత్ర వేలుయుచుండువాడును, స్వయంజ్యోతి స్వరూపుడును, శుద్దుడును, బుద్దుడును, నిత్యుడును, నిరంజనుడును, శాంతుడును అగు సదా శివుడు (పరమాత్మ) ప్రకాశించుచున్నాడు (అనుభూతుడగుచున్నాడు).

16. అరుణికోపనిషత్తు
ఔషదమును స్వీకరించునట్లు భోజనమును (మితముగా) భుజింపవలెను. బ్రహ్మచర్యమును, అహింసను, అపరిగ్రహమును, సత్యమును ప్రయత్న పూర్వకముగా తప్పక రక్షింపవలయును (అవలంబించవలెను).
కామము, క్రోధము, హర్షము, రోషము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఇచ్ఛ, అసూయ, మమత్వము, అహంకారము మున్నగువానిని పరిత్యజించవలెను.

Wednesday, December 11, 2013

14. శ్వేతాశ్వతరోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

పరమాత్మను గూర్చి తెలిసికోనినపుడు సమస్త పాశములనుండి విడినగుచున్నాడు.
పరమాత్మను నెరిగిన యెడల జీవునకు అవిద్యాది పాశములు తొలగిపోయి, క్లేశము క్షయించి జనన మరనాది దుఃఖములు నశించును.                
తనయందున్నట్టి పరమాత్మను ఎల్లప్పుడు తెలిసికోనవలెను. ఎరుంగదగిన వస్తువు దీనికంటె వేరుగ మరేదియును లేదు.         
తన దేహమును క్రిందికట్టేగాను, ఓంకారమును పైకట్టేగను చేసికొని ధ్యానాభ్యాసమను మధనము గావించి నిగూడమైయున్న అత్మదేవుని దర్శించవలయును.
ఆత్మ విద్యకు, తపస్సునకు మూలభూతమైన పరబ్రహ్మమును పాలయందు నేయివలె, సమస్త జగత్తునందును వ్యాపించియున్నట్లు తెలిసికొని జీవుడు బంధరహితుడగుచున్నాడు.
శిరస్సు, కంటము, శరీరము అను ఈ మూడింటిని తిన్నగా నిలిపి, ఇంద్రియములను, మనస్సును హృదయమందు స్థాపించి, బ్రహ్మ మనెడు తెప్పచేత భయావహములైన జననమరనాది సంసారమను ప్రవాహమును జీవుడు దాటవలెను.
చెడ్డ గుర్రములు కల రధమును సారధి బహుజాగరూకుడై నడపించునట్లు, సాధకుడు అప్రమత్తుడై మనస్సును జయించవలయును.                    
యోగాగ్నిమయమైన శరీరము కలవానికి రోగము కాని, వార్ధకము కాని, మరణము కాని ఉండవు.         
యోగాభ్యాసమునందు ప్రవర్తించిన వానికి శరీరము తేలికగా నుండును. ఆరోగ్యవంతముగా నుండును. ఆశలు లేకుండును. శరీరము ప్రకాశమానమై యుండును. కంటధ్వని స్పస్టముగా నుండును.
సాధకుడు అత్మతత్త్వమును దర్శించి అద్వితీయుడును, ధన్యుడును, దుఃఖరహితుడను అగుచున్నాడు.
జన్మరహితమై, నిశ్చలమై, విశుద్దమైనట్టి అత్మదేవుని తెలిసికొని జీవుడు సమస్త పాశములనుండియు విదివడుచున్నాడు.      
ఆ పరమపురుషుని (పరమాత్మను) మహాత్ముడుగను, ప్రకాశస్వరూపుడుగను, తమస్సునకు ఆవలనున్నవాడుగను నేను ఎరుగుచున్నాను. అతని నెరిగి జీవుడు మృత్యువును దాటుచున్నాడు. మోక్షమునకు ఇంతకంటె వేరుమార్గము లేదు.
దీనికంటే శ్రేష్టమైనదికాని, వేరైనదికాని, పెద్దదికాని, చిన్నదికాని ఏదియులేదో, ఏది వ్రుక్షమువలె ఆకశామునందు నిలబడియున్నదో, అట్టి బ్రహ్మముచేత ఈ సమస్త ప్రపంచము పరిపూర్ణమై వ్యాప్తమై యున్నది.
ఈ జగత్తుయోక్క కార్యకారనములకంటే వేరైనదియు, రూపరహితమైనదియు, తాపత్రయవర్జితమైనదియునగు బ్రహ్మమును ఎరింగినవారు మరణరహితులగుచున్నారు. తదితరులు దుఃఖమును పొందుచున్నారు.
ఆ భగవంతుడు సమస్త ప్రాణులయొక్క ముఖములును, శిరస్సులును, కంటములును గలవాడై యున్నాడు. సర్వ జీవుల యొక్క హృదయగుహలందు నివసించుచున్నాడు. అతడు సర్వవ్యాపి, మంగళస్వరూపుడు అయియున్నాడు.
పరమాత్మా అంగుష్టమాత్ర పరిమానముతో హృదయగుహయందు వెలయుచున్నాడు. అతడు పరిపూర్ణుడు, సమస్త ప్రాణుల హృదయములందుండి మనస్సుచే కప్పబడి యున్నాడు. అతడు జ్ఞానమునకు ప్రభువు. ఈ ప్రకార మెరుంగువాడు మరణము లేనివారగుచున్నారు.
ఆ దేవుడు నవద్వారములుకల శరీరమను పట్టణమందు ఆత్మరుపమున వెలయుచు, స్థావరజంగమాత్మకమైన సకల ప్రపంచమును స్వాధీనము చేసుకొని బయటకూడ సంచరించుచున్నాడు.
ప్రకృతి మాయయనియు, ఆ మాయకు అధిపతి ఈశ్వరుడనియు తెలియదగినది. ఆ ఈశ్వరుని యొక్క అవయవరూపములగు పదార్థములచే ఈ జగత్తు వ్యాప్తమై యున్నది.
ఆ ఈశ్వరుడు ప్రక్రుతియగు మాయయందు వశించియున్నాడు. అతడు అద్వితీయుడు; ఈ ప్రపంచమంతయు అతనియందే లయమగుచున్నది. అతడే ముక్తి నొసంగువాడు, స్తుతింపబడువాడు, దేవుడు. అట్టి ఈశ్వరుని బాగుగా విచారించి తెలిసి కొనువాడు పరమ శాంతిని (మోక్షమును) పొందుచున్నాడు.
ఈ ప్రపంచమునందు సుక్ష్మాతిసూక్ష్మమై వెలయువాడును, జగత్తుయొక్క సృష్టికర్తయు, అనేక రూపములు కలవాడును, అద్వితీయుడును, ప్రపంచమంతయు వ్యాపించియున్నవాడును, మంగళస్వరూపుడును అగు పరమేశ్వరుని తెలిసికొని మనుజుడు పరమశాంతిని పొందుచున్నాడు.
ఆ పరమాత్మయే కాలస్వరూపుడును, లోకమును సంరక్షించువాడు, జగత్పరిపాలకుడును, సమస్త ప్రానులందును నిగూఢముగా నున్నవాడును, ఋషులు, దేవతలు ధ్యానించునట్టి దేవదేవుడును అయియున్నాడు. అతని నెరిగి జనులు మృత్యు పాశమును చేధించివేయుచున్నారు.
ఘ్రుతముకంటెను అతి సూక్ష్మమైనవాడును, సమస్తప్రాణులందును నిగుడముగా నున్నవాడును, అద్వయరూపుడును, ప్రపంచమంతయు వ్యాపించియున్నవాడును అగు ఆత్మదేవుని ఎరిగి మనుజుడు సమస్త పాశములనుండియు విడివడుచున్నాడు.

ఎవనికి భగవంతునియందు విశేషభక్తికలదో, అట్లే గురువు నందును కలదో, అట్టి మహాత్మునకు ఉపదేశింపబడిన ఈ బోధలన్నియు చక్కగా ప్రకాశించును. (అనుభవమునకు వచ్చును).

12. కైవల్యోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

సాధనచతుస్టయ సంపత్తిని పొందిన తరువాత అశ్వలాయనుడు భగవంతుడైన బ్రహ్మదేవుని యొద్దకు వెళ్లి ఇట్లడిగెను.
మహాత్మా! శ్రేష్టమైనదియు, ఎల్లప్పుడు సజ్జనులచే ఉపాసింప దగినదియు, దేనిచేత జ్ఞాని సమస్త పాపములను పోగొట్టుకొని పరాత్పరుడగు పరమాత్మను పొందునో, అట్టిదియును అగు బ్రహ్మవిద్యను ఉపదేశింపుడు.
అది విని బ్రహ్మదేవుడు అశ్వలాయనకు ఇట్లు బోధించెను. నీవు శ్రద్ధ, భక్తీ, ధ్యానము, యోగము అనువానిద్వారా భగవంతునిని తెలిసికొనుము. కర్మచేతగాని, సంతానముచేతగాని, ధనముచేతగాని మోక్షము కలుగదు. త్యాగమను ఒక్కదాని చేతనే జ్ఞానులు మోక్షమును పొందిరి.
స్వర్గముకంటె శ్రేష్టమైనదియు, హృదయగుహయందు వుండునదియు, ప్రకాశించునదియు అగు ఆ పరబ్రహ్మమును, వేదాంత విజ్ఞానముచే బాగుగా నిశ్చయింపబడియుండు అర్ధమును తెలిసికొనిన వారును, సన్యాసయోగాముచేత శుద్దమైనట్టి అంతఃకరణము కల వారును అగు యతులు పొందుచున్నారు.
ఆ యతులందరును చివరిజన్మయోక్క అంతమందు బ్రహ్మలోకములందు పరమాత్మను పొంది విమక్తులగుచున్నారు (పునర్జన్మ రహితమగు మోక్షమును పొందుచున్నారు).
ఏకాంతప్రదేశమున సుఖాసనస్థుడై, నిర్మలమనస్కుడై, ఇందియములన్నింటిని నిగ్రహించి, హృదయకమలమును రాజోగుణరహితముగను, పరిశుద్దముగను భావించి, ఆ హృదయ కమల మధ్యమున ఉన్న నిర్మలుడును, అగోచరుడను, అనంతరూపుడును, మంగళకరుడును, ప్రశాంతుడును, అమ్రుతస్వరూపుడును, మాయకు కారణభూతుడును, ఆదిమధ్యాంతరహితుడును, అద్వితీయుడును, సర్వవ్యాపియు, చిదానంద స్వరూపుడును, రూపరహితుడును, ఆశ్చర్యకరుడును, ప్రభువును, త్రినేత్రుడును,నీలకంటుడును, శాంతస్వభావుడును అగు పరమేశ్వరుని ధ్యానించి ముని యగువాడు సర్వసాక్షియు, అజ్ఞానమునకు, అన్యమైనదియు, సమస్త ప్రాణులకును, ఆదికారణమైనదియు నగు పరమాత్మను పొందుచున్నాడు.
ఆ పరమాత్మయే బ్రహ్మ దేవుడు, అతడే శివుడు, ఇంద్రుడు, నాశరహితుడు, ఉత్తముడు, స్వయంబప్రభువు, విష్ణువు, ప్రాణము, కాలము, అగ్ని, చంద్రుడు అయి యున్నాడు.
భూత, భావిష్యత్తులయందుండు సమస్తము ఆ పరమాత్మయే. అతడు శాశ్వతుడు. ఆ పరమాత్మను తెలిసికొని జ్ఞానీ మృత్యువును దాటుచున్నాడు. మోక్షమును పొందుటకు ఇంతకంటే వేరగు మార్గము లేదు.
సమస్త ప్రాణులందును తనను, తనయందు సమస్త ప్రాణులను చూచువాడు పరబ్రహ్మను పొందుచున్నాడు. ఇతర కారణములచే పొందుటకు వీలులేదు.
తన మనస్సును క్రింది కట్టేగను, ఓంకారమును పైకట్టేగను చేసికొని జ్ఞానమను మధనము ద్వారా అభ్యాసము ద్వారా జ్ఞాని అజ్ఞానపాశమును దాహించివేయుచున్నాడు.
ఆ పరమాత్మయే (జీవరూపమున) మాయచే మొహింపబడిన అంతఃకరణము కలవాడై, శరీరమును పొంది కార్యములన్నిటిని చేయుచున్నాడు. అతడే జాగ్రుత్తునందు స్త్రీ, అన్నము పానము మొదలైన విచిత్రములగు భోగములచే పరిత్రుప్తిని పొందుచున్నాడు.
ఆ పరమాత్మనుండి ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, సర్వమును ధరించి యుండు భూమి కలుగుచున్నది.
సర్వస్వరూపియు, ప్రపంచమునకు ముఖ్యస్థానమును, సుక్ష్మముకంటే సూక్ష్మమును అగు పరబ్రహ్మమేది కలది అదియే నీవు. నీవే అది.
జాగ్రుత్తు, స్వప్నము, సుషుప్తి మొదలగు వానియందు ఏ ప్రపంచము గోచరించుచున్నదో, అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నేను అని తెలిసికోనువాడు సమస్త బంధములనుండి విముక్తుడగును.
మూడు అవస్థలయందును అనుభవింపబడునది, అనుభవించువాడు, అనుభావమగును అనునవి యేచి కలవో వానికంటె విలక్షనమైనవాడను, సాక్షియు, చిన్మాత్రుడను అగు సదాశివుడను నేను.
నా యందే (అత్మయందే) సమస్తము కలుగుచున్నది. నా యందే సమస్తము లయించుచున్నది. అట్టి అద్వయ బ్రహ్మమునే నేను అయియున్నాను.
నేను అణువుకంటేను సూక్ష్మముగను, మహత్తుకంటేను మహత్తరమై వున్నాను. విచిత్రమైన ఈ ప్రపంచము నేనే. పురాతన స్వరూపుడను నేనే. ఈశ్వరుడను నేనే. నేను జ్యోతిస్వరూపుడను, మంగళరూపుడను అయియున్నాను.
అనేక వేదములచే తెలియబడువాడను నేనే. వేదాంత ప్రవక్తుడను నేనే. వేదవేద్యుడను నేనే. నాకు పుణ్యపాపములు లేవు. నాకు నాశము లేదు. నాకు జన్మము, దేహము, ఇంద్రియములు, బుద్ధి ఇవి ఎవియు లేవు.
నాకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు లేవు. హృదయగుహయందున్నదియు, రూపరహీతమైనదియు, అద్వితీయమైనదియు, సమస్తమునకు సాక్షియు, సత్తు, అసత్తులేనిదియు, పరిశుద్దమైనదియు నగు పరమాత్మ స్వరూపమును తెలిసికొని జీవుడు అట్టి పరమాత్మా స్వరూపమును పొందుచున్నాడు.

కాబట్టి ఈ పరమాత్మను తెలిసికొని జీవుడు సంసార సముద్రమును నశింపజేయునట్టి జ్ఞానమును పొందుచున్నాడు. దానిచే మోక్షమును బడయుచున్నాడు. శాశ్వత సుఖమును పొందుచున్నాడు.

11.బ్రాహ్మొపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

నాశరహితమగు పరబ్రహ్మమేది కలదో దానిని యజ్ఞోనముగా ధరించవలెను.
ఈ ప్రపంచమంతయు దారమునండు మణులవలె దేనితో గ్రుచ్చబడియున్నదో, అట్టి బ్రహ్మ సూత్రమును యోగవేత్తయు, పరబ్రహ్మ తత్వము తెలిసినట్టియు నగు యోగి ధరించును.  
అద్వితీయుడును, స్వయంప్రకాశుడును అగు పరమాత్మా సమస్త ప్రాణులందును నిగూడముగా నున్నవాడును, సర్వ వ్యాపకుడను, సర్వ భుతాంతర్వర్తియగు ఆత్మస్వరూపమును, సర్వాధ్యక్షుడును, సర్వ ప్రాణులందును అధినసించి యున్నవాడును సాక్షియు, చైతన్యరూపుడును, నిర్గుణుడును అయియున్నాడు.
అద్వితీయుడును, సమస్తమును స్వాదీనపరుచుకొనియుండు వాడును, సర్వభుతాంతరాత్మయు అగు ఏ పరమాత్మా ఒక్క రూపమునే అనేక రూపములుగా చేయునో, అట్టి హృదయమునందుండు పరమాత్మను ఏ ధీరులు దర్శించుడురో వారికే శాశ్వతమగు శాంతి లభించును గాని తదితరులకు కాదు.
మనస్సును క్రిందికట్టెగను, ఓంకారమును పైకట్టెగను చేసి, ధ్యానాభ్యాసమున మధనమున గావించి నిగూడముగనున్న ఆత్మ దేవుణ్ణి దర్శించవలయును.
నువ్వులయండు నూనెవలెను, పెరుగులో వెన్నవలెను, ప్రవాహమునందు జలమువలెను, కొయ్యలందు అగ్నివలెను ఆత్మా అంతఃకరణమున నిగుడముగా నున్నది. సత్యము చేతను, తపస్సు చేతను, ధ్యానాభ్యాసము చేతను అట్టి ఆత్మస్వరూపమును మనుజుడు సాక్షాత్కరించుకోనవలెను.
వాక్కు, మనస్సు, ఏ పరబ్రహ్మమును చేరలేక వెనుకకు మరలుచున్నవో, విజ్ఞుడు దేనిని తెలిసికొని ముక్తుడగుచున్నాడో, అదియే జీవుని పరమాస్థి ఆనందము.

బ్రహ్మవిద్య జ్ఞాన తపస్సులే మూలముగాగల పరమాత్మను పాలయందు నేయివలె సర్వవ్యాపిగా బ్రహ్మవేత్తలు తెలిసికొనుచున్నారు.    

10.బృహదారణ్యకోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.
తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొని పొమ్ము.        
మృత్యోర్మా మమృతం గమయ – మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము..
ఆత్మై వేద మగ్ర ఆసీత్ దేవ ఏవ ... సృష్టికి పూర్వం ఆత్మ ఒకటియే కలదు అంటే ఆదియందు (మొదట) ఆత్మ ఒకటియే కలదు.         
ద్వితీయద్వై భయం భపతి : రెండవ వస్తువు కాని వ్యక్తీకాని యున్నచో భయం కలుగును. (ఆత్మ తప్ప మరియొక వస్తువుకాని, వ్యక్తికాని ఈ ప్రపంచమున లేనందున ఇంక భయమేల కలుగును? కలుగదని భావము.)
ఆత్మ మిక్కిలి ప్రియమైనది. పుత్రునికంటేను, ధనముకంటెను, ఇంకను ఏయే పదార్థములు శ్రేష్టములైనవి కలవో వానికంటేను ఆత్మ ఎంతో ప్రియమైనది. ఆత్మ మన సమీపమందే మన స్వరూపమైయే యున్నది. అనాత్మను ప్రియమణి చెప్పు మనుజునకు, అత్మగ్నని అయ్యా! మీరు ప్రియమణి తలంచు పుత్రాదులు నశించునవి కదా! అని చెప్పెను. ఈ సత్యమును తెలుపుటకు అతడోకడే సమర్ధుడు. అనాత్మరూపమైన దానికి అస్తిత్వము లేదు. అవిద్యచే వున్నట్లు కన్పించును. కావున ఆత్మ యను ప్రియవస్తువునే ఉపాసించవలయును. ఆత్మను ప్రియమని ఉపాసించువాని ఆనందము ఎప్పటికిని నశించదు.
సృష్టికి పూర్వము ఈ  ప్రపంచము బ్రహ్మముగా నుండెను. బ్రహ్మము నేనే బ్రహ్మమునై యున్నాను అని తలంచెను. కావున అది సమస్తమును అయినది.
ఎవడు తన అత్మకంటే వేరైనా దేవత కలదనియు, అది వేరు, తానూ వేరు అనియు భావించి అన్యదేవతోపాసన చేయుచున్నాడో అతడు అవివేకి.
ఎవడీ ప్రపంచమున తన స్వరూపమే అయియున్న ఆత్మ నెరుగక మృతినొందునో, అతనిని ఆత్మ (బ్రహ్మము) రక్షింపదు.అధ్యయనము చేయబడని వేదము మనుజుని రక్షింపనట్లు ఆత్మ అతనిని రక్షింపదు. కాబట్టి ఆత్మ నెరుగని వాడెట్టి మహత్తర పుణ్య మాచరించినప్పటికిని అది ఫలానుభోగాంతమున నశించిపోవును. కావున ఆత్మను తన ప్రపంచమని ఉపాసించవలయును. అట్టివానికి కర్మము అంటదు. ఇట్టి అత్మజ్ఞాని ఏదేది ఇచ్చగించునో, అదన్తయు ఆత్మచే ప్రాప్తమగును.
కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము – ఇవి అన్నియు మనస్సే (మనో రుపములే) అయియున్నవి.
(యాజ్ఞవల్క్యుడు – ఓ మైత్రేయి) భార్య తన భర్త యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియమైయుండుట లేదు. తన ఆత్మ యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియముగా నున్నది. అట్లే భర్త తన భార్యయందును, తండ్రి కుమారునియందును ఆ విధముగా సమస్తమును ఆత్మకోరకే కాని వేరుకాదు. ఆత్మయే చూడదగినది; ఆత్మయే వినదగినది; ఆత్మయే తలంచదగినది; ఆత్మయే ద్యానింపదగినది. ఆత్మయొక్క దర్శనము చేతను, స్మరణము చేతను, ధ్యానము చేతను సమస్తము బోధపడును.
ఆ ఆత్మయే (విశ్వాత్మయే, బ్రహ్మమే) ఈ ఆత్మ (జీవాత్మ). అది సమస్త ప్రానులకును అధిపతి. బండిచక్రముయొక్క నాభియందు అరములు (ఆకులు) గ్రుచ్చబడియున్నట్లు ఈ ఆత్మయందు సమస్తప్రానములు, సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్త భూతములు గ్రుచ్చబడియున్నవి.
ఆత్మ జలమువలె స్వచ్చమై, ఏకమై, ద్రష్టమై, అద్వైతమై యున్నది. అదియే బ్రహ్మలోకము, అనగా పరబ్రహ్మస్థానము. అదీ జీవునకు ఉత్తమగతి. అదియే సమస్త సంపదలకంటెను శ్రేష్టమైనది. అదియే పరమానందము. ఈ ఆనందముయొక్క ఒక్క అంశమున ఆధారపరచుకొని సమస్త ప్రానులును జీవించియున్నవి.
మనుజులలో ఎవడు సకల భోగములు అనుభావించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది. దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును అజ్జనుదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము. ఈ పరమానందమే బ్రహ్మలోకము (పరబ్రహ్మ స్థానము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.
జీవులలో సాధుకర్యము చేయువాడు సాదువైయుండును, పాపము చేయువాడు పాపియై యుండును, పుణ్యము చేయువాడు పుణ్యశాలియై యుండును. కావున జీవుడు పుణ్యపాపములకు తగిన శరీరమును గ్రహించుటకు కారనమైనవాడుగా నున్నాడు. ఎపుడతనికి ఒక సంకల్పము కలుగునో అపుడు ఒక నిశ్చయబుద్ది కలుగుచున్నది. ఎపుడు నిశ్చయబుద్ది కలుగునో, అపుడు కర్మము చేయనారంబించెను. తదుపరి ఆ కర్మఫలము అనుభావించవలసియున్నది.
జ్ఞాని అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మ కాముడు (ఆత్మకంటె వేరుగా మరొకదానిని కోరనివాడు). అట్టి వాణి ప్రాణములు ఎచటికిని పోవుటలేదు. అతడు ఇచటనే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.
ఎపుడు జీవుని హృదయమందు కోరిక లన్నియు నశించి పోవునో, అపుడు మనుజుడు అమ్రుతుడగుచున్నాడు. ఇచటనే బ్రహ్మమును పొందుచున్నాడు.
అవిద్యను (అజ్ఞానమును) ఉపాసించువారు మనస్సును (అంధకారబందుర్గమగు సంసారమును) పొందుదురు. అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు.
అత్మసాక్షాత్కారమును బడసినవాడు విశ్వకృత్తు. అనగా సమస్తము అతని లోకమే (సమస్త లోకములు ఆత్మయందు కల్పింపబడి యుండుటవలన.
ఈ ప్రపంచమున మనము సాధనచే బ్రహ్మత్వమొందినవారము. లేనియెడల మహాకష్టము కలుగును. బ్రహ్మవిద్యచే మోక్షము కలుగును. అదిలేనిచో దుఃఖము కలుగును.
కలిగినట్టియు, కలుగబోవునట్టియు సమస్తమునకు అధిపతియైన పరమాత్మను ఎపుడు జీవుడు సాక్షాత్కరించుకోనుచున్నాడో అపు డాతడు ఇక దేనికిని భయపడవలసిన పనిలేదు.
నిర్మలమైన మనస్సుచేతనే ఆ బ్రహ్మము చూడదగును(సక్షాత్కారింపదగును).ఇచట అనేకత్వము ఒకింతైనను లేదు. సమస్తము బ్రహ్మమే.ఎవడించట అనేకత్వము చూచునో, అతడు ఒక ఒక మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందును.(జనన మరణ రూప సంసారమున దగుల్కొనును).
ఈ బ్రహ్మమును ఈకముగా చూడవలెను. అది అప్రమేతమైనది; ద్రువమైనది; నిత్యమైనది; మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది.జన్మము లేనిది. సర్వ శ్రేష్టమైనది.నాశరహితమైనది.      
ఇట్టి ఆత్మను (బ్రహ్మమును) దీరుడగు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను బడయవలెను. అనేక శబ్దములను ధ్యానింపరాదు. ఎలాయనిన అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే యగును.
ఇట్టి ఆత్మనుగూర్చి వేదఋక్కుచే స్పస్టముగా చెప్పబడి యున్నది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్తయెక్క మహిమ అయి వున్నది. అది పుణ్య కర్మచే వ్రుద్దినిగాని, పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుటలేదు. దాని మహిమ నేరింగినవాడు ఇక శాంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఉపరతువు, తితిక్షువు, ఏకాగ్రచిత్తుడు. ఇతి సల్లక్షణములతో గూడి ఆ మహనీయుడు తనయందే ఆత్మను దర్శించుచున్నాడు.సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు. అతనిని పాపపుణ్యములు అంటవు.అతడు పాపపుణ్యములను దాటుచున్నాడు.అతనిని కృతాకృత కర్మలు బాధించవు.అట్టి కర్మల నతడు భస్మముచేయుచున్నాడు. అతడు పాపరహితుడై, విరజ్జుడై, ఇచ్చారహితుడై, సంశయవర్జితుడై, బ్రహ్మము నేరింగినవాడై యుండు ఇదియే బ్రహ్మలోకము (అంటే ఇప్పుడు వున్నది మనము అంతయు పరమాత్మా లోకము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.
ఈ ఆత్మ మహత్తరమైనది, జన్మరహితమైనది, వార్ధక్యములేనిది, మరణము లేనిది, అమృతమైనది, అభయమైనది. ఇట్లేరుగువారు ఆ అభయ బ్రహ్మమే (ఆత్మయే) అగుచున్నాడు.

ధనము చేత (సంపదల చేత) అమృతత్వము (మోక్షము) లభింపదు. లభించునను ఆశ వ్యర్ధన. అది ఒక్క సాధన ( ధ్యానము) ద్వార మాత్రమే లభింపబడుతుంది.